కలం, ఖమ్మం బ్యూరో: శతాబ్దానికి పైగా సాగిన అలుపెరుగని పోరాటాలు, లెక్కలేనన్ని రక్తతర్పణాలు, వీరోచిత త్యాగాల పునాదులపై నిర్మితమైన ఏఐటీయూసీ (AITUC).. యావత్ శ్రామిక లోకానికి కొండంత అండగా నిలుస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) ఉద్ఘాటించారు. ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాల్వంచ పట్టణంలో శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని సుమారు 25 ప్రధాన కార్మిక అడ్డాలు, కూడళ్లలో ఎర్రజెండాలను ఘనంగా ఆవిష్కరించారు.
కార్మిక హక్కులను కాలరాస్తున్నారు..
అనంతరం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్మిక సదస్సులో కూనంనేని ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బ్రిటిష్ వలస పాలన కాలం నుంచి స్వాతంత్రోద్యమం వరకు దేశ ప్రగతి చక్రాలను తిప్పిన కార్మికుల చెమట చుక్కలకు విలువనివ్వాల్సిన పాలకులు, నేడు పెట్టుబడిదారీ వర్గాలకు ఊడిగం చేస్తూ హక్కులను కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. శ్రామికులు దశాబ్దాల పాటు సమ్మెలు చేసి సాధించుకున్న 44 కార్మిక సంక్షేమ చట్టాలను కేంద్ర పాలకులు నిర్దాక్షిణ్యంగా రద్దు చేసి, యజమానులకు లాభాలు చేకూర్చేలా నాలుగు లేబర్ కోడ్లుగా కుదించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.
దేశద్రోహ విధానాలను ప్రతిఘటించాలి..
జాతి సంపదగా విలసిల్లుతున్న నవరత్న ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కారుచౌకగా తెగనమ్మే దేశద్రోహ విధానాలను శ్రామిక వర్గం ఐక్యంగా ప్రతిఘటించాలని కూనంనేని పిలుపునిచ్చారు. అసంఘటిత రంగ కార్మికులకు ఉద్యోగ, సామాజిక భద్రత, పెన్షన్ సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశవ్యాప్త సమ్మెలకు సిద్ధం కావాలి..
ధరల పెరుగుదలకు అనుగుణంగా చట్టబద్ధమైన కనీస వేతనాలను సవరించాలని, సంక్షేమ బోర్డులను అమలు చేసి కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.హక్కులు ఎవరూ దానంగా ఇవ్వరని, పోరాటాల ద్వారానే సాధించుకోవాలని పేర్కొంటూ.. ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు రానున్న రోజుల్లో దేశవ్యాప్త సమ్మెలకు కార్మిక శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాధం, మేయర్ మూడ్ గణేష్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీసంశెట్టి పూర్ణచందర్ రావు, ఉప్పుశెట్టి రాహుల్, కార్పొరేటర్లు, తదితర నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, భారీ సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

