కలం, మహబూబ్నగర్ బ్యూరో: ఉద్యోగ, కార్మిక వర్గాలకు చట్టబద్ధ హక్కుల సాధన కావాలంటే బలమైన గట్టి పోరాటాలే శరణ్యమని తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ (AITUC) రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి అన్నారు. ఏఐటీయూసీ 107వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ప్రాంగణంలో వేడుకలు నిర్వహించారు. వైద్య ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్, నర్సింగ్ ఆఫీసర్స్, ల్యాబ్ టెక్నీషియన్ వివిధ విభాగాల సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముందుగా ఏఐటీయూసీ పతాకాన్ని ఎంప్లాయిస్ యూనియన్ బ్రాంచ్ ప్రధాన కార్యదర్శి వెంకటేష్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. వెట్టి చాకిరి నిర్మూలన, పని గంటల తగ్గింపు, కనీస వేతనాలు, చట్టబద్ధ హక్కులు ఎజెండాగా లాలా లజపతిరాయ్ అధ్యక్షతన 1920 సంవత్సరంలో ముంబయిలో ఏఐటీయూసీ ఆవిర్భవించిందన్నారు. దేశంలోనే తొలి కార్మిక సంఘం ఏఐటీయూసీ అని తెలిపారు. ఆనాటి నుండి నేటి వరకు అనేక సమరాలు నడిపిందని, రాజ్యాధినేతల తలలు వంచి అనేక చట్టాల అమలులో ఏఐటీయూసీ అనేకమంది విప్లవకారుల అమరత్వాన్ని భరత గడ్డ అంకితం చేసిందన్నారు. వైద్య ఉద్యోగుల సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, వాటిని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న పీఆర్సీని తక్షణమే ఇవ్వాలని, కనీస వేతనం 26 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.
మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. అనేక త్యాగాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లుగా పాలకులు తీసుకురావడం కార్మిక వర్గానికి వెన్నుపోటు పొడవడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్ విధానం రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని, వైద్య ఉద్యోగుల భద్రతకు కఠిన చర్యలు తీసుకురావాలని కోరారు.
కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ.. పాలకులు ఉద్యోగుల, కార్మికుల జీతాలు పెంచకుండా ఎంపీ, ఎమ్మెల్యేల జీతభత్యాల పెంపు కోసం మాత్రం అసెంబ్లీలో, పార్లమెంటులో బిల్లులకు ఆగమేఘాల మీద ఆమోదం తెలుపుతారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు కార్మికులకు చెల్లిస్తున్న వేతనాలతో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఒక్కరోజు అయినా జీవించగలరాఝ అని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నేతలు కోటేశ్వర్ రెడ్డి, వెంకటేష్, దేవానంద్, గోపాల్ నాయక్, సతీష్ రెడ్డి, కరుణాకర్, చెన్నయ్య, సోమేశ్, బాలకోటి, బాలరాజు, యాదయ్య, జే.నరసింహ, లోకేష్, యాదగిరి, నరేష్, కృష్ణ, రాఘవేందర్, మున్నా, మురళి, బుచ్చన్న, సంతోష్, పవన్, వెంకటేష్, నాగరాజు, నంద కిషోర్, నవీన్, రవి కుమార్, శ్రీను, శ్రావణి, పద్మ, సత్తమ్మ, సునీత, చంద్రకళ, మల్లమ్మ, తిరుపతమ్మ, జ్యోతి, మంగమ్మ, నాగమణి, సువర్ణ, అలివేలమ్మ, మహేశ్వరి, శ్రీదేవి, పద్మ, తదితరులు పాల్గొన్నారు.

