కలం, ఖమ్మం బ్యూరో: ఫార్మర్ ఐడీ లేకపోతే భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పంట రుణాలు అందవని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతి (Bhadradri DRO Padmavathi) స్పష్టం చేశారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆమె అగ్రిస్టాక్ యాప్ ద్వారా చేపడుతున్న రైతు రిజిస్ట్రీ, డిజిటల్ క్రాప్ బుకింగ్ ప్రక్రియను సమీక్షించారు.
ఈ సందర్భంగా వ్యవసాయశాఖ అధికారి బాబురావు మాట్లాడుతూ.. భద్రాద్రి జిల్లాలోని 1.85 లక్షల మంది రైతులకు గాను ఇప్పటివరకు 1.39 లక్షల మంది రిజిస్ట్రేషన్ పూర్తయిందని, మరో 45 వేల మంది నమోదు కావాల్సి ఉందని తెలిపారు. డీఆర్ఓ పద్మావతి మాట్లాడుతూ.. పంట రుణాలు, ధాన్యం కొనుగోళ్లు, పంటల బీమా, నష్టపరిహారం అందాలంటే ‘ఫార్మర్ ఐడీ (Farmer ID)’ అత్యంత కీలకమని తెలిపారు.
మిగిలిన రైతులందరూ మీసేవ, సీఎస్సీ కేంద్రాలు లేదా మండల వ్యవసాయ కార్యాలయాల్లో పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డు, మొబైల్ నంబర్‌తో త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని డీఆర్ఓ సూచించారు. ఈ లక్ష్య సాధనకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సీపీఓ సునీత, లీడ్ బ్యాంకు మేనేజర్ రామిరెడ్డి, ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వర రావు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

