కలం, కరీంనగర్ : ఓటమి భయంతో అలమటిస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఉనికిని చాటుకోవడానికే నవంబర్ 1న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో నిరసన రాజకీయ డ్రామా మొదలుపెట్టిందని, రాజ్యాంగ పరిరక్షణ పేరిట, ఎన్నికల సంఘం, ఎస్ఐఆర్ పై కాంగ్రెస్ చేస్తున్నది అనవసర రాద్ధాంతమేనని బీజేపీ మహిళా మోర్చా (BJP Mahila Morcha) రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి ఘాటుగా విమర్శించారు. నంబర్ 5న కరీంనగర్లో తలపెట్టిన మహా పాదయాత్రకు (Maha Padayatra) సంబంధించి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని వివిధ మండలాల మహిళా మోర్చా అధ్యక్షులు, మహిళా ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలతో సన్నాక సమావేశం కరీంనగర్ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు గుర్రాల నిర్మలరెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని అతిధి హోటల్లో జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. స్వతంత్ర రాజ్యాంగ సంస్థలైన కేంద్ర ఎన్నికల సంఘం పై బురదజల్లుతూ, రాజ్యాంగం ప్రమాదంలో ఉందనే నిరాధార ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ముఖ్యంగా నవంబర్ 1న ఢిల్లీలో రామ్ లీలా మైదానంలో తలపెట్టిన నిరసన కార్యక్రమం రాహుల్ గాంధీ బాధ్యతారాహిత్య వైఖరి, ఆయన రాజకీయ దురుద్దేశాన్ని స్పష్టంగా తెలియజేస్తుందన్నారు.
“పోలీసులకు, లాఠీలకు భయపడకండి” అంటూ లోక్సభ ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న రాహుల్ గాంధీ ప్రజలను, కార్యకర్తలను రెచ్చగొట్టడం ఉసికొల్పేలా మాట్లాడటమే కాంగ్రెస్ స్వార్థ రాజకీయాలకు నిదర్శనమన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, మేయర్ కొలగని శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు, మాజీ జెడ్పీ చైర్మన్ కనునమల్ల విజయలు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసే కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టను దిగజార్చేందుకు “ఓట్ల చోరీ”, ఎస్ఐఆర్ ప్రక్రియపై నిరాధార ఆరోపణలు చేయడం ద్వారా రాజ్యాంగ వ్యవస్థల పట్ల కాంగ్రెస్కు ఉన్న అపనమ్మకాన్ని మళ్లీ బయటపెట్టుకుందన్నారు. చట్టబద్ధమైన సవరణలకు, ఈవీఎం సంస్కరణలకు చట్టసభల్లో చర్చించాల్సిన విపక్షం, వీధుల్లో నిరసనలు చేస్తూ అశాంతిని సృష్టించడానికి ప్రాధాన్యం ఇవ్వడం సరికాదన్నారు.
పండుగల సీజన్ కొనసాగుతున్న సమయంలో రామ్లీలా మైదానంలో 10 లక్షల మందితో భారీ ర్యాలీ నిర్వహించడం వల్ల పాత, కొత్త ఢిల్లీ వ్యాపారాలు దెబ్బతింటాయని, రద్దీతో కోట్లాది రూపాయల వ్యాపారం నిలిచిపోతుందని ఢిల్లీ వ్యాపార సంఘాలు సోనియా గాంధీకి లేఖ రాసినప్పటికీ కాంగ్రెస్ స్పందించకపోవడం దారుణమని, ప్రజల, వ్యాపారుల శ్రేయస్సు కంటే తమ రాజకీయ లబ్ధే ముఖ్యాంశమని కాంగ్రెస్ నిరూపించిందనే విషయం దీంతో స్పష్టంగా అర్థమవుతుందన్నారు. దేశంలో కాంగ్రెస్ పూర్తిగా ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిందని, ఇటీవల పలు రాష్ట్రాల్లో బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు చెంపపెట్టు లాంటి తీర్పు వచ్చిందన్నారు.
అందుకే కాంగ్రెస్ రాజకీయ ఉనికి కోసం ప్రయత్నిస్తుందని, ఎన్నికల వ్యవస్థపై అపనమ్మకం కలిగించి ఓటమికి ముందస్తు సాకులు వెతుక్కునే ప్రయత్నం చేస్తుందని ఘాటుగా విమర్శించారు. ప్రధానంగారాహుల్ గాంధీ ఒక “అరాచక శక్తిగా” మారి దేశ ప్రతిష్టను, రాజ్యాంగ సంస్థలను దెబ్బతీస్తున్నారని, ఎన్నికల్లో గెలవలేక ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ప్రజల సమస్యలపై కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర ఎన్నికల సంఘం, ఎస్ ఐ ఆర్ల పై కాంగ్రెస్ వివాదాలను లేవనెత్తి నిరసనలు చేయడం ఆ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం లాంటిదన్నారు.
కాంగ్రెస్ చేపట్టిన “నవంబర్ 1 రామ్లీలా నిరసన” రాజ్యాంగ పరిరక్షణ కోసం కాదని, కాంగ్రెస్ రాజకీయ క్రీడలో భాగమని స్పష్టం చేశారు . దేశంలో కాంగ్రెస్ అవలంబిస్తున్న విధానాలను, అరాచక పద్ధతులను ప్రజాక్షేత్రంలో ఎండ గట్టడానికి, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి బీజేపీ ఆధ్వర్యంలో ఈనెల 5న కరీంనగర్లో మహా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పాదయాత్రలో ప్రజలు, యువత, మహిళలు స్వచ్ఛందంగా భారీ ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కరీంనగర్ నగర పాలక సంస్థ మహిళా కార్పొరేటర్లు, సర్పంచ్లు వివిధ మండలాల మహిళా మోర్చా అద్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

