కలం, జడ్చర్: మియాపూర్ భూముల (Miyapur Lands) కేసులో నిన్న ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చిన నేపథ్యంలో, ఆ భూములను విక్రయించి అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఖర్చు పెడతామని ముఖ్యమంత్రి ప్రకటించడం సమంజసం కాదని బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షుడు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ (Burugupalli Krishna Yadav) తెలిపారు. శనివారం జడ్చర్లలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ప్రభుత్వ భూములు ఏ ఒక్క ముఖ్యమంత్రికో, ఏ ఒక్క రాజకీయ పార్టీకో చెందిన ఆస్తులు కావనీ, అవి ప్రజల సంపద అని అన్నారు. ప్రజా ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది తప్ప, వాటిని అమ్మి ఆదాయం పొందడం ఒక్కటే ప్రభుత్వ లక్ష్యం కాకూడదన్నారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడాల్సిన విలువైన భూములను విక్రయించడం వల్ల కలిగే దీర్ఘకాలిక నష్టాలను ప్రభుత్వం గుర్తించాలని ఆయన గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని మార్చుకొని మియాపూర్ భూముల విక్రయ ఆలోచనను మానుకోవాలని, ఆ భూములను ప్రజా అవసరాలకు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా ఆస్తుల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రజాగ్రహాన్ని ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీసీ జాగృతి సేన మండల అధ్యక్షులు గొడుగు నర్సిములు, కార్మిక విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సురభి విజయ్ కుమార్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గోపాల్, శివ శంకర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

