కార్మికుల హక్కుల సాధనలో ఏఐటీయూసీకి ఘన చరిత్ర: టేకుమల్ల సమ్మయ్య

కలం, ​కరీంనగర్: దేశంలో కార్మిక వర్గ పోరాటాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఏర్పడిన మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ అని, కార్మికులకు అనేక హక్కులు సాధించి పెట్టిన ఘన చరిత్ర దీనికి ఉందని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య అన్నారు. ​ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ (‌‌‌Karimnagar) ‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లోని ఏఐటీయూసీ జిల్లా కార్యాలయం వద్ద ఆయన జాతీయ జెండాను ఎగరవేశారు. ​

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాలా లజపతిరాయ్, బాలగంగాధర్ తిలక్, జవహర్‌లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, వి.వి. గిరి, ఎస్.ఎ. డాంగే, ఇంద్రజిత్ గుప్తా, ఎ.బి. వర్ధన్ వంటి మహామహుల నాయకత్వంలో 1920 అక్టోబర్ 31న ఈ సంఘం ఆవిర్భవించిందని గుర్తుచేశారు. ఈ ఎర్రజెండా నేటికి 106 సంవత్సరాలు పూర్తి చేసుకుని 107వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా కార్మిక లోకానికి విప్లవాత్మక శుభాకాంక్షలు తెలియజేశారు.

​ప్రస్తుతం దేశంలో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పనికి తగిన ఫలితం లేకపోవడం, సరైన జీతాలు లేకపోవడం, తీవ్రమైన పని ఒత్తిడితో కార్మికులు నలిగిపోతున్నారని పేర్కొన్నారు. గత 100 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాల ద్వారా సాధించుకున్న 44 కార్మిక చట్టాలలో 29 చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి, పెట్టుబడిదారులకు అనుకూలంగా 4 కోడ్‌లుగా మార్చి కార్మికుల హక్కులను హరిస్తోందని విమర్శించారు. మే డే స్ఫూర్తితో సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని మారుస్తూ, 12 గంటల పని విధానాన్ని తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని, ఈ విధానాలపై కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

​ఈ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు జంగం తిరుపతి యాదవ్, జిల్లా సహాయ కార్యదర్శి బెజ్జంకి కాళిదాస్, ఏఐటీయూసీ నగర కార్యదర్శి కిమ్మసారపు నరసయ్య, నాయకులు జక్కుల ఆగయ్య, ఆల్లపు రాజు, ఓర్సు కొమురయ్య, ఐలయ్య, చీర్లవంచ శ్రీనివాస్, శివ, జక్కుల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>