కలం, మహబూబ్ నగర్ బ్యూరో: భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమె దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటూ ప్రభుత్వ విప్, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam Srinivas Reddy) ఘనంగా నివాళులర్పించారు. దేశ సమగ్రత, సార్వభౌమత్వం, ఆర్థికాభివృద్ధి, పేదల సంక్షేమం కోసం ఇందిరా గాంధీ చేసిన కృషి భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
శనివారం ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నగరంలోని అశోక్ టాకీస్ చౌరస్తా వద్ద గల ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ రాజకీయ చరిత్రలో ధైర్యసాహసాలకు, దృఢ సంకల్పానికి, అసాధారణ నాయకత్వ పటిమకు ప్రతీకగా నిలిచిన మహానేత ఇందిరా గాంధీ అని కొనియాడారు.
దేశ సమగ్రత కోసం ఇందిరాగాంధీ సేవలు మరువలేనివి..
దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ఆమె తీసుకున్న నిర్ణయాలు, దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూ సాగించిన పాలన భారతదేశ అభ్యున్నతిలో కీలక పాత్ర పోషించాయని గుర్తు చేశారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వ పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా ఆమె పనిచేశారని గుర్తుచేశారు. ఇందిరా గాంధీ పాలనలో పేదలు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక ప్రాధాన్యం లభించిందని పేర్కొన్నారు.
సామాజిక, ఆర్థిక అసమానతలను తగ్గించి, అణగారిన వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందించాలనే లక్ష్యంతో ఆమె చేపట్టిన కార్యక్రమాలు దేశ రాజకీయాలపై చెరగని ముద్ర వేశాయని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రోత్సాహం అందించడం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా ఆమె చేసిన ప్రయత్నాలు చిరస్మరణీయమని తెలిపారు. భారతదేశం ఎదుర్కొన్న అనేక రాజకీయ, ఆర్థిక, అంతర్జాతీయ సవాళ్ల సమయంలో ఇందిరా గాంధీ ప్రదర్శించిన నాయకత్వం ఆమె రాజకీయ దృఢత్వానికి నిదర్శనమని అన్నారు.
కఠిన పరిస్థితుల్లోనూ నిర్ణయాలు తీసుకునే ధైర్యం, దేశ ప్రయోజనాల పట్ల అంకితభావం, ప్రజల పట్ల బాధ్యతాయుతమైన దృక్పథం ఆమెను భారత రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానంలో నిలిపాయని పేర్కొన్నారు. ఆమె జీవిత ప్రస్థానం, పోరాట పటిమ, దేశ సేవ పట్ల చూపిన నిబద్ధత నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. దేశ సమగ్రతను కాపాడటం, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడం, దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడం వంటి అంశాల్లో ఇందిరా గాంధీ అందించిన సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
దేశం కోసం అంకితభావంతో పనిచేసిన నాయకుల ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ప్రజాసేవకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. భారతదేశ చరిత్రలో తనదైన ప్రత్యేక ముద్ర వేసిన ఇందిరా గాంధీ సేవలు, త్యాగం, నాయకత్వ లక్షణాలు ఎప్పటికీ మరువలేనివని, దేశ ప్రజల హృదయాల్లో ఆమె చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి , ఇందిరా గాంధీ వర్థంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ సీజే బెనహర్, టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్, యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అవేజ్, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.మహేందర్ , నాయకులు సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, సాయిబాబా, మైత్రి యాదయ్య, అబ్దుల్ హక్, పీర్ మహ్మద్ సాధిక్, అక్బర్, యాదిరెడ్డి, ఫైసల్ వివిధ డివిజన్ల కార్పొరేటర్లు యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

