తీపి పండించే నేల.. జహీరాబాద్ చెరుకు రైతుల వ్యథ!

కలం, మెదక్‌ బ్యూరో: సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ ప్రాంతం చెరుకు సాగుకు పేరుగాంచింది. ఇక్కడి రైతులు (Zahirabad Sugarcane Farmers) తరతరాలుగా చెరుకునే నమ్ముకొని జీవిస్తున్నారు. కానీ.. ఇప్పుడు పంటను అమ్ముకోవడం రైతుకు తలకు మించిన భారంగా మారింది. స్థానికంగా ఉన్న ట్రైడెంట్‌ షుగర్స్‌ ఫ్యాక్టరీ మూతపడటంతో పండించిన చెరుకును ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లోని కర్మాగారాలకు తరలించాల్సి వస్తోంది. దీనికి తోడు వర్షాభావంతో దిగుబడులు తగ్గడం, రవాణా ఖర్చులు పెరగడంతో రైతుల కష్టాలు రెట్టింపయ్యాయి. దళారులు రంగంలోకి దిగి గంపగుత్తగా చెరుకును కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తుండటంతో రైతులకు ఆశించిన ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తమవుతోంది.

25 వేల ఎకరాల్లో..

జహీరాబాద్‌ ప్రాంతంలో సారవంతమైన ఎర్ర నేలలు, నీటిని నిల్వ ఉంచుకునే నల్లరేగడి నేలలు విస్తారంగా ఉన్నాయి. ఈ ప్రాంత వాతావరణం, ఉష్ణోగ్రతలు చెరుకులో తీపి శాతం పెరగడానికి దోహదపడతాయని చెబుతారు. దీంతో జహీరాబాద్‌ చెరుకుకు మార్కెట్‌లో డిమాండ్‌ ఉంటుంది. జహీరాబాద్‌, న్యాల్‌కల్‌, ఝరాసంగం, మొగుడంపల్లి, కోహీర్‌ మండలాల్లో గతంలో ఏటా 25 వేల నుంచి 30 వేల ఎకరాల్లో చెరుకు సాగయ్యేది. అయితే వర్షాభావ పరిస్థితులు, స్థానిక ఫ్యాక్టరీ అనిశ్చితి, రవాణా భారం పెరగడంతో రెండేళ్లుగా సాగు విస్తీర్ణం తగ్గింది. ప్రస్తుతం సుమారు 20 వేల నుంచి 25 వేల ఎకరాల్లో పంట సాగవుతోంది.

ట్రైడెంట్‌ మూతతో మొదలైన కష్టాలు

జహీరాబాద్‌ డివిజన్‌లో చెరుకు సాగు ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వ భాగస్వామ్యంతో 1970లో కొత్తూర్‌ (బి) గ్రామంలో నిజాం షుగర్స్‌ పేరిట చక్కెర కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం వివిధ కారణాలతో ప్రైవేటు వ్యక్తులకు విక్రయించడంతో ఫ్యాక్టరీ పేరు ట్రైడెంట్‌ షుగర్స్‌గా మారింది. జహీరాబాద్‌ నియోజకవర్గంలోని ఐదు మండలాల రైతులతో ముందుగానే ఒప్పందాలు చేసుకుని చెరుకును కొనుగోలు చేసేది. అయితే యాజమాన్య నిర్వహణ లోపాలు, ఆర్థిక సమస్యలతో ఐదేళ్ల క్రితం ఫ్యాక్టరీ మూతపడింది.

దీంతో స్థానిక రైతులు పండించిన చెరుకును క్రషింగ్‌ కోసం ఇతర ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాయికోడ్‌ మండలంలోని కొత్తగా నిర్మించిన గోదావరి గంగ ఫ్యాక్టరీతో పాటు సంగారెడ్డి సమీపంలోని గణపతి కర్మాగారానికి చెరుకును పంపిస్తున్నారు. గోదావరి గంగ కర్మాగారం జహీరాబాద్‌ డివిజన్‌లోని మూడు మండలాల రైతులతో ఒప్పందాలు చేసుకుంది. అయితే రోజుకు 3 వేల టన్నుల క్రషింగ్‌ సామర్థ్యం ఉన్న ఈ కర్మాగారం ఒక సీజన్‌లో 3 లక్షల నుంచి 4 లక్షల మెట్రిక్‌ టన్నుల చెరుకును మాత్రమే క్రషింగ్‌ చేయగలదు. దీంతో ఒప్పందం చేసుకున్న రైతుల చెరుకును క్రషింగ్‌ చేయడానికే పరిమితమవుతోంది.

స్థానికంగా ఫ్యాక్టరీ అందుబాటులో లేకపోవడంతో జహీరాబాద్‌, మొగుడంపల్లి మండలాలను ఫ్రీజోన్‌గా ప్రకటించారు. దీంతో రైతులు పండించిన చెరుకును ఎక్కడ విక్రయించాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఇదే అదనుగా దళారులు, ప్రైవేటు వ్యక్తులు రంగంలోకి దిగుతున్నారు. జహీరాబాద్‌ ప్రాంత చెరుకును కర్ణాటకలోని బీదర్‌ జిల్లాతో పాటు మహారాష్ట్రలోని కర్మాగారాలకు తరలిస్తున్నారు.

టన్నుకు రూ.100–200 మాత్రమే

గతంలో స్థానిక ఫ్యాక్టరీ అందుబాటులో ఉండటంతో టన్నుకు రూ.100–200 మాత్రమే రవాణా ఖర్చయ్యేది. ఇప్పుడు 60 నుంచి 200 కిలోమీటర్ల దూరంలోని కర్మాగారాలకు తరలించాల్సి వస్తోంది. దీంతో టన్నుకు రూ.600–800 వరకు రవాణాకే ఖర్చవుతోంది. చెరుకు నరికిన 24–48 గంటల్లోగా క్రషింగ్‌ చేయాలి. దూర ప్రాంతాలకు లారీల్లో తరలించే క్రమంలో ఆలస్యమైతే చెరుకులోని రసం తగ్గి బరువు తగ్గుతుంది. ఫలితంగా రైతుకు వచ్చే ఆదాయం కూడా పడిపోతోంది.

మద్దతు ధర కల్పించాలని డిమాండ్‌

ప్రభుత్వమే పంటను కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యాలు ఇష్టానుసారంగా ధర నిర్ణయిస్తున్నాయని, ప్రస్తుతం టన్నుకు సుమారు రూ.4 వేలే చెల్లిస్తున్నాయని రైతులు చెబుతున్నారు. ఈ ధరతో పెట్టుబడి ఖర్చులు కూడా తిరిగి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కేన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, ప్రభుత్వం చొరవ తీసుకుని చక్కెర కర్మాగారాల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. టన్నుకు రూ.5,500 మద్దతు ధర నిర్ణయించడంతో పాటు ప్రభుత్వం అదనంగా రూ.500 బోనస్ ఇవ్వాలని కోరుతున్నారు. రవాణా ఖర్చులను ఫ్యాక్టరీ యాజమాన్యాలే భరించాలని సూచిస్తున్నారు. లేదంటే ట్రైడెంట్‌ షుగర్స్‌ను ప్రభుత్వం పునరుద్ధరించాలని లేదా కొత్త యాజమాన్యానికి అప్పగించి వెంటనే తెరిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

తగ్గిన దిగుబడి.. పెరిగిన పెట్టుబడి

గతంలో ఎకరానికి 35–40 టన్నుల చెరుకు దిగుబడి వచ్చేది. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో 20–25 టన్నులకే పరిమితమైందని రైతులు పేర్కొంటున్నారు. దిగుబడి తగ్గడంతో పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎరువులు, దుక్కి దున్నడం, పంట కోత, రవాణా ఖర్చులు భారంగా మారాయని చెబుతున్నారు. కూలీలకు రోజుకు రూ.500–600 వరకు చెల్లించాల్సి వస్తోందని పేర్కొంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>