కలం, వెబ్‌డెస్క్ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్18 (GSLV-F18 )రాకెట్‌ను శుక్రవారం రాత్రి 11.51 గంటలకు ప్రయోగించారు. నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్ సుమారు 18 నిమిషాల ప్రయాణం అనంతరం ఎన్వీఎస్-03 ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ (జీటీఓ)లోకి చేర్చింది.
భారతదేశ సొంత నావిగేషన్ వ్యవస్థ నావిక్ (NavIC) సేవలను విస్తరించడంలో ఈ ఉపగ్రహం కీలక పాత్ర పోషించనుంది. ఇందులో దేశీయంగా అభివృద్ధి చేసిన అణు గడియారాన్ని అమర్చారు. ఎల్1 బ్యాండ్ సిగ్నల్‌తో పనిచేసే ఎన్వీఎస్-03 ద్వారా నావిగేషన్ సమాచారాన్ని మరింత మెరుగ్గా అందించేందుకు అవకాశం కలగనుంది. ఇది నావిక్ వ్యవస్థలో నాలుగో ఆపరేషనల్ ఉపగ్రహంగా సేవలు అందించనుంది. ఈ ప్రయోగంతో దేశీయ ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ వ్యవస్థ సామర్థ్యం మరింత పెరగనుంది. భవిష్యత్తులో నావిక్ సేవలను మరింత విస్తరించేందుకు ఎన్వీఎస్-04, ఎన్వీఎస్-05 ఉపగ్రహాల ప్రయోగాలపై ఇస్రో దృష్టి పెట్టింది. తాజా ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధనల్లో మరో కీలక ఘట్టంగా నిలిచింది.

