కలం, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట (Ellanthakunta) మండలాన్ని ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోజురోజుకూ క్షీణిస్తున్న భూగర్భ జలాల పరిరక్షణపై ప్రజలు, రైతులు తీవ్ర అప్రమత్తత వహించాలని ఎమ్మార్వో నరేష్ (MRO Naresh) సూచించారు. వర్షాభావ పరిస్థితుల వల్ల రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా ఉండాలంటే భూగర్భ జలాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
ఈ ఏడాది ఎల్నినో ప్రతికూల ప్రభావం కారణంగా మండలంలో సాధారణ వర్షపాతం తగ్గడంతో భూగర్భ జలమట్టాలు పాతాళానికి పడిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే ఎండకాలంలో తాగునీటి మరియు సాగునీటి కొరత రాకుండా చూడటానికి ప్రభుత్వం జారీ చేసిన ఆంక్షలు, నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
మండల పరిధిలో సంబంధిత అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి కొత్త బోర్వెల్లు తవ్వరాదని తహసీల్దార్ ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా బోర్వెల్లు వేస్తే తెలంగాణ నీరు, భూమి, చెట్ల సంరక్షణ చట్టం ప్రకారం బాధ్యులపై కఠినమైన చట్టరీత్యా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనుమతి లేకుండా తవ్వకాలు జరిపే బోర్వెల్ రిగ్గులను స్వాధీనం చేసుకోవడంతో పాటు యజమానులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
అత్యవసర అవసరాల నిమిత్తం బోర్వెల్ వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటే, ముందుగా రెవెన్యూ , భూగర్భ జల శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకుని నిబంధనల ప్రకారం ముందస్తు అనుమతి పొందాలని సూచించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలంతా నీటిని వృథా చేయకుండా అత్యంత పొదుపుగా వాడుకోవాలని, అక్రమ బోర్వెళ్ల తవ్వకాల సమాచారం తెలిస్తే వెంటనే రెవెన్యూ అధికారులకు సమాచారం అందించాలని తహసీల్దార్ కోరారు.

