కలం, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, పెండింగ్ సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) అధికారులను ఆదేశించారు. శుక్రవారం రిమ్స్ మెడికల్ కళాశాలలో డైరెక్టర్ ఛాంబర్ లో రిమ్స్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, వైద్య సేవలు, మౌలిక వసతులు, పరిష్కరించాల్సిన పెండింగ్ సమస్యలపై సమగ్రంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆసుపత్రిలో పెండింగ్లో ఉన్న సివిల్ పనులు, విద్యుత్ మరమ్మతులు, ఆక్సిజన్ పైప్లైన్కు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నిర్దేశించిన కాలపరిమితిలోగా అన్ని పనులను పూర్తి చేసి, రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ, రోగుల సంరక్షణ, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
శానిటేషన్ వర్కర్లు, పేషెంట్ కేర్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు విధుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించేలా, సమయపాలన పాటించేలా సంబంధిత కాంట్రాక్టర్లు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ (Rajarshi Shah) ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్ రావు, రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జై సింగ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. సాధన, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాంకుమార్, మున్సిపల్ సహాయ ఇంజనీర్ అరుణ్, డ్రగ్ ఇన్స్పెక్టర్, పీడియాట్రిక్, గైనకాలజీ వైద్య నిపుణులు, పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖల ఇంజనీరింగ్ అధికారులు, రిమ్స్ విభాగాధిపతులు పాల్గొన్నారు.

