కలం, కరీంనగర్: కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం (Karimnagar CP Gaush Alam) నగర టూ టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్లోని జనరల్ డైరీ, ఎఫ్ఐఆర్ కాపీలు, పెండింగ్ కేసులు, రౌడీ షీటర్ల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణ, రిసెప్షన్ కౌంటర్, లాకప్ రూమ్లను పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, బాధితుల సమస్యలను శ్రద్ధగా విని వారికి త్వరితగతిన న్యాయం చేకూర్చాలని సిబ్బందిని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి అలసత్వం వహించరాదని, పట్టణ పరిధిలో నిరంతరం పెట్రోలింగ్, నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో ఏసీపీ వెంకటస్వామి, టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సీఐ) సృజన్ రెడ్డితో పాటు పోలీస్ స్టేషన్ ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

