కలం, నిర్మల్ : విపత్తుల సమయంలో ప్రజలకు సహాయం అందించేందుకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన 22 మంది ఎన్సీసీ క్యాడెట్లు యువ ఆపద మిత్ర శిక్షణ (Yuva Aapda Mitra Training) పూర్తి చేశారు. ఆదిలాబాద్‌లోని 32 (టి) బెటాలియన్ ఎన్సీసీ ఆధ్వర్యంలో ఎనిమిది రోజులపాటు నిర్వహించిన శిక్షణలో పాల్గొన్న క్యాడెట్లకు కళాశాలలో శుక్రవారం యువ ఆపద మిత్ర కిట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఎం.సుధాకర్ మాట్లాడుతూ.. విపత్తుల సమయంలో శిక్షణ పొందిన యువత ప్రజలకు అండగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నాగ శ్రీనివాస్, ఎన్సీసీ అధికారి డాక్టర్ బి. ఉమేష్, అధ్యాపకులు డాక్టర్ సూర్యసాగర్, రమేష్ రెడ్డి, శ్రీహరి, డాక్టర్ ఎం. రజిత, రహమాన్ తదితరులు పాల్గొన్నారు.

