తీన్మార్ మల్లన్నకు పున్న కైలాష్ వార్నింగ్

కలం, నల్లగొండ: సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డిపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అజ్ఞానానికి, మూర్ఖత్వానికి నిదర్శనమని నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత (Punna Kailash Netha) మండిపడ్డారు. జానారెడ్డికి 24 గంటల్లోగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే మల్లన్న పాదయాత్రలో తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని బహిరంగ లేఖ ద్వారా హెచ్చరిక జారీ చేశారు. హింసకు తావులేని రాజకీయాలను నడిపి నల్లగొండ జిల్లాను ఆదర్శ రాజకీయ క్షేత్రంగా మలిచిన ఘనత జానారెడ్డికే దక్కుతుందని కొనియాడారు. సాంబశివుడు సహా అనేక మంది నక్సల్స్‌ను లొంగుబాటు చేయించి, వారిపై కేసులను ఎత్తివేసి పునరావాసం కల్పించారని గుర్తుచేశారు.

జానారెడ్డి కారణం కాదు..

నయీం లాంటి నరహంతకుడిని పెంచి పోషించిన బీఆర్‌ఎస్‌ను వదిలేసి, కల్మషం లేని జానారెడ్డిపై నిందలు వేయడం తీన్మార్ మల్లన్న చౌకబారుతనానికి అద్దం పడుతోందని పున్న కైలాష్ నేత విమర్శించారు. బలహీన వర్గాల రిజర్వేషన్లు అమలు కాకపోవడానికి జానారెడ్డి కారణమని మల్లన్న చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. తనలాంటి పేద బీసీ వ్యక్తిని నల్లగొండ డీసీసీ అధ్యక్షుడిని చేయడమే కాకుండా, బాలు నాయక్, శంకర్ నాయక్ లాంటి గిరిజన నేతలను, కొండేటి మల్లయ్య లాంటి దళిత నేతలను రాజకీయంగా ప్రోత్సహించిన వ్యక్తి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మల్లన్న కోసం జానారెడ్డి సొంతంగా డబ్బులు ఖర్చు చేసిన సంగతిని మర్చిపోయారని విమర్శించారు.

బీసీలను రాజకీయం సమాధి చేయడానికే..

తీన్మార్ మల్లన్న చేపడుతున్న పాదయాత్ర బీసీ రాజ్యాధికారం కోసమా.. లేకపోతే బీసీలను శాశ్వతంగా రాజకీయ సమాధి చేయడానికా.. అని అని పున్న కైలాష్ నేత ప్రశ్నించారు. స్వార్థ రాజకీయాల కోసం ప్రజల్లో చిచ్చు పెట్టే గారడీ మాటలు మానుకొని బీసీల ఐక్యతకు కృషి చేయాలని హితవు పలికారు. బహిరంగ లేఖ విడుదల కార్యక్రమంలో ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు జిల్లాపల్లి పరమేష్, శాలిగౌరారం మండల అధ్యక్షుడు చింత ధనుంజయ్, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి ముంతాజ్ అలీ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏళ్ల రవీందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి పగిళ్ల రాజు, చర్లపల్లి గౌతమ్, వేముల గోపీనాథ్, మట్టపల్లి నాగరాజ్, జమ్మూ అశోక్, ఆకటి సైదులు, ఎండి అజీజ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>