కలం, కరీంనగర్ : కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధికి 8 కిలోమీటర్ల లోపు ఉన్న గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు గతంలో అమలైన 17 శాతం ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ)ను తిరిగి పునరుద్ధరించాలని జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు (JAC leaders) కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాను (Collector Chitra Mishra) కలిసి వినతిపత్రం అందజేశారు.
జిల్లా ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి, కన్వీనర్, టీజీవోస్ జిల్లా అధ్యక్షుడు మడిపల్లి కాళీచరణ్ గౌడ్ నేతృత్వంలో ప్రతినిధి బృందం కలెక్టర్‌ను కలిసింది. 2018, 2025 సంవత్సరాల్లో ప్రభుత్వం జారీ చేసిన ప్రత్యేక ఉత్తర్వులు, గెజిట్ నోటిఫికేషన్ల ద్వారా కరీంనగర్ సమీపంలోని పలు గ్రామాలు నగరపాలక సంస్థ పరిధిలో విలీనమయ్యాయని వారు వివరించారు. జేఏసీ విజ్ఞప్తి మేరకు గతంలో జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా తనకు కల్పించిన అధికారాలను వినియోగించి హెచ్ఆర్ఏ పెంపునకు చర్యలు తీసుకున్నారని తెలిపారు.
ఎస్ఈ పంచాయతీరాజ్, ఎస్ఈ ఆర్అండ్బీ, మున్సిపల్ కమిషనర్లతో కూడిన త్రిసభ్య కమిటీ క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి, నగర సరిహద్దు నుంచి 8 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల దూరం, మ్యాపులతో కూడిన నివేదికను సమర్పించిందన్నారు. ఈ నివేదిక ఆధారంగా కరీంనగర్ సమీపంలోని 21 గ్రామాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు హెచ్ఆర్ఏను 11 శాతం నుంచి 17 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ కాగా, 2025 సెప్టెంబర్ 26న గెజిట్ కూడా వెలువడిందని పేర్కొన్నారు.
అయితే, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అనుమతి, ఆమోదం (రాటిఫికేషన్) లేదనే కారణంతో హెచ్ఆర్ఏను తిరిగి 11 శాతానికి తగ్గించారని జేఏసీ నాయకులు తెలిపారు. దీంతో ఆయా గ్రామాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. గతంలో నిర్వహించిన సర్వే, జారీ చేసిన ఉత్తర్వులు, గెజిట్‌ను పరిగణనలోకి తీసుకొని 17 శాతం హెచ్ఆర్ఏ పునరుద్ధరణకు అవసరమైన ప్రతిపాదనలను ప్రభుత్వానికి వెంటనే పంపించాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపై కలెక్టర్ చిత్రా మిశ్రా సానుకూలంగా స్పందిస్తూ, రాటిఫికేషన్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. ఉద్యోగులు ఆందోళన చెందవద్దని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ భరోసా ఇచ్చారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు జేఏసీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

