ముడాకు అదనపు నిధుల కోసం సీఎంను కలుస్తాం: ఎమ్మెల్యే యెన్నం

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ముడా నిధులను ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ, అత్యవసర అభివృద్ధి పనులకు సమర్థవంతంగా వినియోగించాలని ముడా జనరల్ బాడీ సమావేశంలో చర్చించినట్లు ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) తెలిపారు. ముఖ్యంగా ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సమావేశంలో చర్చించినట్లు పేర్కొన్నారు.

శుక్రవారం ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ అధ్యక్షతన మహబూబ్‌నగర్‌లోని ముడా కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, సంబంధిత అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సమావేశం అనంతరం ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, ప్రజలకు అత్యంత అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ముఖ్యంగా తాగునీటి సరఫరా మెరుగుదల, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించనున్నట్లు వివరించారు.

గతంలో మంజూరై వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను గుర్తించి, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా సగంలో నిలిచిపోయిన నిర్మాణ పనులను వెంటనే తిరిగి ప్రారంభించి, అసంపూర్తిగా ఉన్న ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లు, సమావేశ మందిరాలు తదితర నిర్మాణాలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. ప్రజాధనం వృథా కాకుండా ఇప్పటికే చేపట్టిన పనులను పూర్తి చేసి, వాటి ప్రయోజనాలను ప్రజలకు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

గతంలో ముడా నిధులతో విద్యావ్యవస్థ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చామని ఆయన వివరించారు. హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ, స్టడీ రూమ్‌ల ఏర్పాటు, అవసరమైన పరికరాల సమకూర్పు, అదనపు గదుల నిర్మాణం, తాగునీరు, మినరల్ వాటర్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు నిధులను వినియోగించినట్లు తెలిపారు. ఈసారి కూడా ప్రజల అవసరాలే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని స్పష్టం చేశారు. అత్యవసర అవసరాలను గుర్తించి, ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించే పనులకు ప్రాధాన్యతనిస్తూ ముడా నిధులను సమర్థవంతంగా వినియోగిస్తామని చెప్పారు.

మహబూబ్‌నగర్ నగరంతో పాటు ముడా పరిధిలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో కృషి చేస్తామని పేర్కొన్నారు. ముడా పరిధిలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు అందుబాటులో ఉండేలా కృషి చేస్తామని తెలిపారు. ముడా పరిధిలోని ఎమ్మెల్యేలందరం కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ముడాకు అదనపు నిధులు మంజూరు చేయాలని కోరుతామని చెప్పారు.

అదనపు నిధులు సమకూరితే పెండింగ్ పనులను పూర్తి చేయడంతో పాటు, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమం, తాగునీటి సరఫరా మెరుగుదల, మౌలిక సదుపాయాల అభివృద్ధి, అసంపూర్తి పనుల పూర్తి లక్ష్యంగా ముడా నిధులను వినియోగిస్తూ మహబూబ్‌నగర్‌తో పాటు ముడా పరిధిలోని ప్రాంతాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>