రైతుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట: యెన్నం శ్రీనివాస్ రెడ్డి

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రజా ప్రభుత్వ సహకారంతో తెలంగాణ రాష్ట్ర రైతులు వ్యవసాయ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధిస్తూ, దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే (Mahabubnagar MLA) యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. శుక్రవారం నగరంలోని మార్కెట్ యార్డులో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఖరీఫ్ సీజన్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు వ్యవసాయం రైతుల పాలిట రోదనగా ఉండేదని, నేడు రైతుల కష్టానికి తగిన ఫలితం అందిస్తూ వ్యవసాయాన్ని పండుగగా మార్చేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను తగ్గించి, వారిని రుణభారం నుంచి విముక్తి చేయాలనే లక్ష్యంతో అర్హులైన రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రైతులు సన్న వడ్లు సాగు చేస్తే క్వింటాలుకు అదనంగా రూ.500 బోనస్ అందిస్తున్నామని తెలిపారు. రైతులకు అధిక ఆదాయం, మెరుగైన లాభాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు, వారి శ్రమకు తగిన గుర్తింపు లభించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చినప్పుడు వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలిపారు. రైతులకు అధిక లాభాలు అందించడంతో పాటు, పేద ప్రజలకు కడుపునిండా నాణ్యమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో రేషన్ కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికీ ఆరు కిలోల సన్న బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

రైతు సంక్షేమం, పేదల ఆకలి తీర్చడం అనే రెండు ప్రధాన లక్ష్యాలతో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. రైతులు పండించిన పంటకు ప్రోత్సాహం అందిస్తూ, పేదలకు నాణ్యమైన ఆహారం అందించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తెలంగాణను వ్యవసాయ రంగంలో మరింత అభివృద్ధి చేయడంతో పాటు రైతులకు ఆర్థిక భరోసా కల్పించడం, ప్రతి పేద కుటుంబానికి ఆహార భద్రత కల్పించడం ప్రజా ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, కార్పొరేటర్లు ప్రశాంత్, రమేష్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్ యాదవ్, పీర్ మహ్మద్ సాధిక్, మార్కెట్ యార్డు కార్యదర్శి అనిత తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>