కలం, వెబ్ డెస్క్ : నగరంలోని కాచిగూడ (Kachiguda) రైల్వే క్వార్టర్స్ పరిధిలో 13 ఏళ్ల బాలిక (13-Year-Old Girl) అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. రాత్రి సమయంలో దుకాణానికి వెళ్లి వస్తానని ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బాలాఘాట్‌కు చెందిన రాధిక బహేశ్వర్ రెండు నెలల క్రితం హైదరాబాద్‌కు వచ్చింది.
కాచిగూడ రైల్వే క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న తన అక్క నందా కిషోర్ వద్ద ఉంటోంది. ఈ క్రమంలో ఈ నెల 27వ తేదీ రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో షాప్‌కు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అయితే ఎంతసేపటికీ బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు తెలిసిన బంధువులు, పరిచయస్తుల వద్ద విచారించినప్పటికీ ఎలాంటి సమాచారం లభించలేదు.
దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు బాలిక అదృశ్యంపై మిస్సింగ్ కేసు నమోదు చేశారు. బాలిక ఆచూకీ కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టి, అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

