కలం, భువనగిరి: కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘గ్లోబల్ సమ్మిట్’పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran) కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ అంటున్నట్లు అది గోబెల్స్ సమ్మిట్ కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏ మంచి పని చేయకూడదనేదే కేటీఆర్ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ దుర్మార్గపు పాలనను చూసిన ప్రజలు, కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా అధికారంలో ఉంచుతారనే ఆందోళన, బాధ కేటీఆర్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కరువు రావాలని కేటీఆర్ కోరుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఎల్ నినో ప్రభావం వలన మాత్రమే కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించారు. ప్రస్తుతం కృత్రిమ మేధ విస్తరణ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయని చామల గుర్తుచేశారు.
యువతకు ఉద్యోగావకాశాల కోసమే..
అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఉద్యోగులను తొలగిస్తున్నాయని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇలాంటి సమయంలో యువత స్కిల్ డెవలప్మెంట్పై ఆధారపడక తప్పదన్నారు. తెలంగాణ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోందని చెప్పారు.
బీఆర్ఎస్ పాలనలో ఒక్క గ్లోబల్ సమ్మిట్ కూడా నిర్వహించలేకపోయారని విమర్శించారు. రూ.9 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని కేటీఆర్ ఫేక్ మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్లలో రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆరోపించారు. వివిధ కార్పొరేషన్ల పేరుతో 12 శాతం వడ్డీకి అప్పులు తీసుకురావడం వలన ప్రస్తుతం నెలకు రూ.8 వేల కోట్లు కేవలం వడ్డీల రూపంలోనే చెల్లించాల్సి వస్తోందని వెల్లడించారు.

