కలం, నల్లగొండ: ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయించిన ప్రత్యేక అభివృద్ధి నిధులపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాల ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చూడాలన్నారు. గురువారం నల్లగొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో షెడ్యూల్డ్ కులాల ప్రత్యేక అభివృద్ధి నిధుల వినియోగం, అభివృద్ధి పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా విప్ వేముల వీరేశం మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు నిధుల కేటాయింపు కేవలం ఖర్చులకే పరిమితం కాకుండా లబ్ధిదారుల సామాజిక, ఆర్థిక స్వావలంబనకు దోహదపడాలన్నారు. ప్రతి శాఖ పరిధిలో అమలవుతున్న పథకాల వివరాలను అర్హులకు తెలియజేయాలని, ప్రతి నెలా సమీక్షలు నిర్వహించి పనుల పురోగతిని పరిశీలించాలని సూచించారు.
విద్యా, వైద్య రంగాల బలోపేతమే లక్ష్యం..
రాష్ట్ర ప్రభుత్వం పేదరికాన్ని నిర్మూలించేందుకు, సామాజిక సమానత్వం సాధించేందుకు కట్టుబడి ఉందదని విప్ వేముల వీరేశం అన్నారు. విద్య, వైద్య రంగాల్లో మెరుగైన సదుపాయాలు అందిస్తేనే సామాజిక అభివృద్ధి వేగవంతమవుతుందని చెప్పారు. ‘యంగ్ ఇండియా స్కూళ్లు’, ‘తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల’ను ఏర్పాటు చేస్తున్నామని, రాబోయే రోజుల్లో ప్రతి మండలానికి ఒక స్కూల్ ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ధాన్యం మార్కెట్లకు చేరకముందే వ్యాపారులు పొలాల వద్దే తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులకు నష్టం కలిగించకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా సంక్షేమ శాఖ డిడి శశికళ, అధికారులు పాల్గొన్నారు.

