కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు అధికారులు, విద్యాసంస్థల యాజమాన్యాలు, కళాశాలల ప్రతినిధులు సమష్టి బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Collector Khushboo Gupta) సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు కేవలం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా, మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించిన సమాచారం సేకరించి, వాటి నివారణకు క్రియాశీలక చర్యలు చేపట్టాలని అన్నారు.
గురువారం మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా కలెక్టరేట్లో మాదకద్రవ్యాల నివారణపై జిల్లా అధికారులు, కళాశాలల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ ఖుష్బూ గుప్తా, జిల్లా ఎస్పీ డి. జానకితో కలిసి పాల్గొన్నారు. జిల్లాలో మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు చేపడుతున్న చర్యలు, విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న కార్యక్రమాలపై సమీక్షించారు.
విద్యార్థులు మత్తుకు బానిస కాకుండా చూడాలి: కలెక్టర్
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, ఆరోగ్యంపై పడే ప్రభావం, భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలు, చట్టపరమైన పరిణామాలపై విద్యార్థులకు నిరంతరం అవగాహన కల్పించాలన్నారు. అన్ని కళాశాలల్లో మాదకద్రవ్యాల నివారణకు సంబంధించిన పోస్టర్లు ఏర్పాటు చేయడంతో పాటు తరచూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
విద్యార్థులు మాదకద్రవ్యాలకు అలవాటు పడినట్లు లేదా వాటి విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ముఖ్యంగా వైద్య, ఇంజినీరింగ్, విశ్వవిద్యాలయాలు, ఇతర వృత్తి విద్యా కళాశాలల్లో ప్రవేశ సమయంలో నిర్వహించే పరిచయ కార్యక్రమాల్లోనే మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, చట్టపరమైన అంశాలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
విద్యార్థుల ప్రవర్తనపై నిఘా పెట్టండి: ఎస్పీ జానకి
జిల్లా ఎస్పీ డి. జానకి మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలకు సంబంధించిన 24 కేసులు నమోదు చేసి, 32 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించి పోలీసులకు సమాచారం అందించడంలో కళాశాలల యాజమాన్యాలు, ప్రతినిధులు మరింత చొరవ చూపాలని కోరారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నట్లు తెలిసినా, వాటి విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు తెలియజేయాలన్నారు.
కళాశాలల పేరుప్రతిష్ఠలకు భంగం కలగకుండా, సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించేందుకు విద్యాసంస్థల ప్రతినిధులు పోలీసులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అవసరమైతే సంబంధిత విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి, వ్యసన విముక్తి కేంద్రాలకు పంపించి చికిత్స, కౌన్సెలింగ్ అందించే చర్యలు చేపడతామని తెలిపారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా, మరికొన్ని కేసుల్లో తదుపరి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
గంజాయితో పాటు వైట్నర్, దగ్గు మందుల సిరప్లు, ఫెవికాల్ వంటి పదార్థాలను దుర్వినియోగం చేసే అవకాశాలపైనా విద్యాసంస్థలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. కొన్ని పదార్థాల దుర్వినియోగాన్ని సాధారణ మాదకద్రవ్య పరీక్షల ద్వారా గుర్తించడం కష్టమవుతుందని, అందువల్ల విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను అధ్యాపకులు, వార్డెన్లు గమనించాలని అన్నారు. మత్తు పదార్థాల వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ పై. మధుసూదన్ నాయక్, డి.ఆర్.ఓ ఎ. నిర్మల, డి.డబ్ల్యూ.ఓ జరీన బేగం, కళాశాలల ప్రతినిధులు, ప్రిన్సిపాల్ లు, ఎన్. జి. ఓ ప్రతినిధులు, విద్య శాఖ, వైద్య శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

