కలం, ఆదిలాబాద్: అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్ల నియమానికి సంబంధించిన ఇంటర్వ్యూ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షిషా (Rajarshi Shah) స్పష్టం చేశారు. ఉట్నూర్ మండలంలో ఖాళీగా ఉన్న వివిధ అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్ నియమానికి దరఖాస్తు చేసుకున్న మహిళ అభ్యర్థులకు గురువారం కేబీ కాంప్లెక్స్ పిఏంఆర్సి సమావేశ మందిరంలో ఐటీడీఏ పీవోతో కలిసి ఆయన ఇంటర్వ్యూలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ (Rajarshi Shah) మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా, శిశు సంక్షేమానికి అంగన్వాడీ కేంద్రాల పాత్ర కీలకమని, వాటిని బలోపేతం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం టీచర్, హెల్పర్ నియామకాలను చేపట్టిందన్నారు. అర్హులైన ప్రతి అభ్యర్థికీ సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ నియామక ప్రక్రియను పకడ్బందీగా చేపట్టామన్నారు.
ఉట్నూర్ మండలంలో 27 టీచర్ పోస్టులకు అర్హత సాధించిన 92 మందిలో 89 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకాగా, ముగ్గురు గైర్హాజరయ్యారని వివరించారు. ఎంపిక ప్రక్రియలో పూర్తిగా మెరిట్, నిబంధనలకే పెద్దపీట వేసినట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో ఉట్నూర్ సబ్ కలెక్టర్ ప్రణయ్ కుమార్, డీడబ్ల్యూవో మిల్కా, తదితరులు పాల్గొన్నారు.

