కలం, పెద్దపల్లి: గోదావరిలో వృథాగా పోతున్న కాళేశ్వరం జలాలను తక్షణమే ఎత్తిపోసి, ఎండిపోతున్న పంటలను కాపాడాలని పెద్దపల్లి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దాసరి మమతా రెడ్డి (Dasari Mamatha Reddy) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల పంటలను కాపాడాలనే లక్ష్యంతో పెద్దపల్లి పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్, రామగుండానికి చెందిన బొడ్డు రవీందర్ ఆధ్వర్యంలో మేడిగడ్డ నుంచి చేపట్టిన నిరసన సైకిల్ యాత్రకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై, జెండా ఊపి ప్రారంభించి పూర్తి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు తదితర ముఖ్య నాయకులు పాల్గొని రైతుల పోరాటానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ దాసరి మమతా రెడ్డి మాట్లాడుతూ.. వెంటనే సాగునీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని కోరారు.
వెంటనే నీటిని విడుదల చేయాలి
కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద ప్రస్తుతం సుమారు 2 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, ప్రభుత్వం నీటి లభ్యతపై స్పష్టతనిచ్చి వెంటనే సాగునీటిని విడుదల చేయాలని మమతా రెడ్డి డిమాండ్ చేశారు. తద్వారా ఎండిపోతున్న ఎకరాల కొద్దీ పంటలను కాపాడాలని స్పష్టం చేశారు.
కేసీఆర్ దూరదృష్టి- కాళేశ్వరం ప్రాజెక్టు
కేసీఆర్ దూరదృష్టితో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ వ్యవసాయ రంగానికి వరప్రదాయిని అని ఆమె అన్నారు. ప్రాజెక్టు నిర్వహణలో ప్రభుత్వం రాజకీయాలను పక్కనపెట్టి రైతుల ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పంటలు ఎండిపోతున్న ఈ క్లిష్ట సమయంలో రైతులకు ఉచిత విద్యుత్, సాగునీరు అందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని గుర్తుచేశారు. ధాన్యం కొనుగోలు, రైతుబంధు, బోనస్ హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నీటి విడుదల విషయంలో ‘సెల్ఫ్ డిక్లరేషన్’ పేరుతో ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించకుండా, క్షేత్రస్థాయిలో పంటల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేందుకే యాత్ర
కాళేశ్వరం పరివాహక ప్రాంతాల్లో ప్రతిరోజూ 40 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణిస్తూ రైతుల ఆవేదనను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్న నాయకుల కృషి అభినందనీయమని మమతా రెడ్డి అన్నారు. “రైతు ఏడ్చిన వ్యవసాయం, రాజ్యం ఎన్నటికీ బాగుపడదు” అని పేర్కొంటూ, రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పెద్దపల్లి పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్, కాశీపాక వాసు, సురేష్, పల్లె మధు, కౌన్సిలర్ విన్నం సుజాత రవీందర్, మాజీ కౌన్సిలర్ నాంసాని సురేష్ బాబుతో పాటు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

