ఎల్‌నినో ఎఫెక్ట్‌.. జల సంరక్షణకు విద్యార్థులే సైన్యం!

కలం, యాదగిరిగుట్ట : ఎల్‌నినో ప్రభావంతో (El Nino Effect) నీటి లభ్యతపై ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు యాదాద్రి–భువనగిరి జిల్లా యంత్రాంగం విద్యార్థులను జల సంరక్షణలో భాగస్వాములను చేసింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని 189 పాఠశాలల 9వ తరగతి విద్యార్థులతో బుధవారం ప్రత్యేక ప్రాజెక్ట్ వర్క్ నిర్వహించారు. గ్రామాల్లో ఇంకుడు గుంతల పనితీరు, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపునకు తీసుకుంటున్న చర్యలను విద్యార్థులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

విద్యార్థులను బృందాలుగా విభజించి, ఒక్కో బృందానికి ఉపాధ్యాయుడిని కేటాయించారు. గ్రామాల్లో ఎన్ని ఇంకుడు గుంతలు ఉన్నాయి? ఎన్ని సక్రమంగా పనిచేస్తున్నాయి? మరమ్మతులు అవసరమైనవి ఎన్ని? వాటి నిర్వహణ బాధ్యతలు ఎవరు చేపడుతున్నారు? అనే అంశాలపై వివరాలు సేకరించారు. గ్రామాల్లో నీటి వినియోగం, నీటి లభ్యత, పొదుపు చర్యలను పరిశీలించి నివేదికలు రూపొందించారు. కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో నీటి సంరక్షణ ప్రాధాన్యాన్ని విద్యార్థులకు తెలియజేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.

నీటి వృథాను అరికట్టడం, ఇంకుడు గుంతలను సక్రమంగా నిర్వహించడం, వర్షపు నీటిని ఒడిసిపట్టడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించవచ్చనే అంశాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు తమ కుటుంబ సభ్యులకు, గ్రామ ప్రజలకు నీటి పొదుపు ఆవశ్యకతను వివరించేలా ప్రోత్సహించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, కేజీబీవీ ప్రత్యేక అధికారులు, సెక్టోరియల్ అధికారులు, గ్రామ కార్యదర్శులు కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.

ఎల్‌నినో ప్రభావం (El Nino Effect) నేపథ్యంలో నీటి వనరులను కాపాడుకోవడం, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించడం అత్యంత కీలకమని ఈ కార్యక్రమం చాటిచెప్పింది. విద్యార్థులను జల సంరక్షణ రాయబారులుగా తీర్చిదిద్దడం ద్వారా గ్రామస్థాయిలో నీటి పొదుపు ఉద్యమాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>