కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు (Chandrababu) అమరావతి సచివాలయ సమీపంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) కేంద్రాన్ని సందర్శించి అర్నబ్ తుఫాన్ ప్రభావిత జిల్లాల పరిస్థితులను సమీక్షించారు. తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరా నెట్వర్క్ ద్వారా క్షేత్రస్థాయి పరిణామాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్ ఉన్నతాధికారులు తుఫాన్ గమనం, తీరం దాటే దిశ, ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రికి వివరంగా ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ సమీక్షలో భాగంగా ఈదురుగాలుల ధాటికి పలు ప్రాంతాల్లో విరిగిపడిన చెట్ల వల్ల రహదారి రవాణాకు ఏమైనా అంతరాయం కలిగిందా? అని సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తుఫాన్‌ను సమర్థంగా ఎదుర్కొన్నామని , ముందస్తు అప్రమత్తతో తీవ్ర ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకున్నామని సీఎం చంద్రబాబు అధికారులతో అన్నారు. టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకుని ఈ విజయం సాధించమని అధికారుల్ని అభినందించారు. ఈ క్రమంలోనే రహదారులపై పడిపోయిన చెట్లు, విద్యుత్ స్తంభాలను యుద్ధ ప్రాతిపదికన తొలగించి జాతీయ రహదారులతో పాటు ఇతర ముఖ్యమైన రోడ్లలో రవాణా వ్యవస్థను వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు.
తుఫాన్ హెచ్చరికలు జారీ అయిన నాటి నుంచి ఆర్టీజీఎస్ ద్వారా 24 గంటలూ కంట్రోల్ రూమ్ సేవలు అందిస్తూ పరిస్థితులను సూక్ష్మంగా పర్యవేక్షిస్తున్నామని ఐటీ కార్యదర్శి కాటంనేని భాస్కర్ సీఎంకు తెలిపారు. మరోవైపు, ప్రజల నుంచి ‘మన మిత్ర’ యాప్ ద్వారా అందుతున్న అత్యవసర ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఆర్టీజీఎస్ కేంద్రీకృత వ్యవస్థ ద్వారా ఆయా దరఖాస్తులను క్షేత్రస్థాయిలోని సంబంధిత శాఖల అధికారులకు తక్షణమే రీ-రౌట్ చేస్తూ, ప్రజలకు ఎలాంటి తీవ్ర ఇబ్బందులు తలెత్తకుండా వేగంగా పరిష్కరిస్తున్నట్లు ముఖ్యమంత్రికి నివేదించారు.

