అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ములుగులో స్తంభించిన కరెంట్ సరఫరా!

కలం, వరంగల్ బ్యూరో: కరువు ఛాయల నుంచి వర్షాల కోసం ఎదురుచూస్తున్న ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారింది. అర్నబ్ తుఫాన్ (Arnab Cyclone) ప్రభావంతో ములుగు జిల్లాలో భారీ వర్షం కురుస్తుండగా, వరంగల్‌, హనుమకొండ నగరాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. వర్షాల రాకతో వాతావరణం చల్లబడినా, రానున్న గంటల్లో వర్ష తీవ్రత ఎలా ఉంటుందన్న దానిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

తుఫాన్ ప్రభావంతో ములుగు జిల్లాకు భారీ వర్ష సూచన ఉండగా, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నేడు ములుగు సహా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి.

కాగా, తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షం ప్రభావం విద్యుత్ వ్యవస్థపై కూడా పడింది. ములుగు సబ్‌స్టేషన్ పరిధిలోని 33 కేవీ కాసిందేవుపేట ఫీడర్‌లో ఏర్పడిన బ్రేక్‌డౌన్ కారణంగా ఉదయం నుంచి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో అప్రమత్తమైన టీజీఎన్‌పీడీసీఎల్ అధికారులు వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు. 33 కేవీ మల్లంపల్లి ఫీడర్ ద్వారా కాసిందేవుపేట, పతిపల్లి సబ్‌స్టేషన్లకు విద్యుత్ సరఫరాను మళ్లించి అంతరాయాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. మిగిలిన అన్ని ఫీడర్లలోనూ సరఫరా యథావిధిగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

సబ్‌స్టేషన్‌లో తలెత్తిన సాంకేతిక లోపాన్ని KDP-107 పాయింట్ వద్ద ‘పిన్ ఇన్సులేటర్’ విఫలమైనట్లు అధికారులు గుర్తించారు. ములుగు డివిజన్ ఎస్‌ఈ (ఆపరేషన్), డీఈ (ఆపరేషన్) అధికారులు స్వయంగా రంగంలోకి దిగి మరమ్మతు పనులను పర్యవేక్షిస్తున్నారు. తుఫాన్ పరిస్థితుల దృష్ట్యా ఎలాంటి ప్రాణనష్టం లేదా పెద్దఎత్తున విద్యుత్ అంతరాయం కలగకుండా అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. వీలైనంత త్వరగా దెబ్బతిన్న విద్యుత్ లైన్లను పునరుద్ధరించి సాధారణ స్థితిని తీసుకువచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>