కలం, జోగులాంబ గద్వాల: ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ ధాన్యాన్ని సకాలంలో ఇవ్వకుండా, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ (Rizwan Basha Shaik) హెచ్చరించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో సివిల్ సప్లై అధికారులు, మిల్లర్లతో సమావేశమయ్యారు. విజిలెన్స్ అధికారులు ఇటీవలే నిబంధనలు ఉల్లంఘించిన ఒక మిల్లును సీజ్ చేశారని.. సీఎంఆర్ ధాన్యం ప్రభుత్వానికి ఇవ్వకుండా కొంతమంది మిల్లర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వేలం వేసిన ధాన్యం విషయంలోనూ ప్రభుత్వానికి డబ్బులు చెల్లించాల్సి ఉందన్నారు. పెద్ద ఎత్తున పెండింగ్ ఉన్న మిల్లర్లకు షోకాజ్ నోటీసులను జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎంఆర్ ధాన్యం డెలివరీ పక్కన పెట్టి ప్రైవేటు ధాన్యాన్ని మిల్లింగ్ చేసే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
కేసులు నమోదు చేస్తాం..
డిఫాల్టర్స్కు గతంలోనే జరిమానాలు విధించామని, బకాయిలను చెల్లించకపోతే కేసులు నమోదవుతాయని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరించారు. గత ఖరీఫ్, రబీ సీజన్ ధాన్యాన్ని 20 రోజుల్లో డెలివరీ చేయాలని ఆదేశించారు. కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న ఆయా మిల్లుల సీఎంఆర్ సమగ్ర వివరాలను 15 రోజుల్లోగా అందజేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. బ్యాంకు గ్యారంటీ ఇచ్చే మిల్లులకే ధాన్యం కేటాయింపులు ఉంటాయన్నారు. చౌక ధర దుకాణాల ద్వారా తెల్ల రేషన్ కార్డుదారులకు వచ్చే సంవత్సరం వరకు ప్రతి నెల బియ్యం సరఫరా చేయాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ మేనేజర్ విమల, డీటీలు ప్రశాంత్, రాజేష్ పాల్గొన్నారు.

