కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ‘అర్నబ్’ తుఫాన్(Arnab Cyclone) ప్రభావంతో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అంకిత్ (Collector Ankit) ఆదేశించారు. ప్రజల ప్రాణరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. మంగళవారం తుఫాన్ ప్రభావం, వాతావరణ పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భద్రాచలం సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రానున్న 36 గంటలు అత్యంత కీలకమని కలెక్టర్ తెలిపారు. అన్ని శాఖల అధికారులు ప్రధాన కార్యాలయాల్లో అందుబాటులో ఉండి, క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న గ్రామాలు, వాగులు, వంకలు, కాల్వలు, ప్రమాదకర కల్వర్టులు, పాత వంతెనల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. నీటి ప్రవాహం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజల రాకపోకలను నియంత్రించేందుకు బారికేడ్లు ఏర్పాటు చేయాలని, ప్రమాదకర మార్గాల్లో రాకపోకలను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించారు. ఇంద్రావతి, తాలిపేరు పరివాహక ప్రాంతాల్లో నీటిమట్టాలు, వరద ప్రవాహాన్ని నిరంతరం పరిశీలించాలని తెలిపారు. రైల్వే మార్గాల్లో ప్రమాదాలు జరగకుండా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని, రహదారులపై చెట్లు కూలితే వెంటనే తొలగించేందుకు సిబ్బంది, పరికరాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.
సహాయక చర్యల కోసం ఛాతకొండలో 22 మంది సభ్యులతో కూడిన ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని, భద్రాచలంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని సిద్ధంగా ఉంచినట్లు కలెక్టర్ తెలిపారు. విద్యాసంస్థలు, వసతి గృహాల్లో విద్యార్థుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వర్షాల తీవ్రతను బట్టి తగిన నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. రానున్న రెండు, మూడు రోజుల్లో ప్రసవాలు జరిగే అవకాశం ఉన్న గర్భిణులను గుర్తించి ముందుగానే ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించాలని, 108 వాహనాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించేందుకు కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం ప్రాంతాల్లోని విద్యుత్ శాఖ కంట్రోల్ రూమ్లను అప్రమత్తం చేశారు. గ్రామాల్లో దండోరా ద్వారా తుఫాన్ హెచ్చరికలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు.
తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ప్రజలకు అత్యవసర సహాయం అందించేందుకు అధికారులు అందుబాటులో ఉంటారని కలెక్టర్ తెలిపారు. భారీ వర్షాలు, వరదలు లేదా ఇతర అత్యవసర పరిస్థితులు ఎదురైతే ప్రజలు ఫైర్ ఆఫీసర్ క్రాంతి (87126 99523), కొత్తగూడెం ఆర్డీవో డి. మధు (93929 19715), భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ఠ (93929 19716), కొత్తగూడెం ఐడీఓసీ కంట్రోల్ రూమ్ (93929 19743) నంబర్లను సంప్రదించాలని సూచించారు.

