కలం, మహబూబ్ నగర్ బ్యూరో: దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) పేర్కొన్నారు. మంగళవారం అప్పన్నపల్లి సమీపంలోని పోసానికుంట గట్టుపై వెలసిన శ్రీ మైసమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ముడా నిధులు రూ.25 లక్షలతో నూతనంగా నిర్మించనున్న మల్టీపర్పస్ షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రకృతి రమణీయమైన వాతావరణంలో కొలువైన మైసమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆలయ ప్రాంగణ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆలయ ప్రాంగణంలో నిర్మించనున్న మల్టీపర్పస్ షెడ్ భక్తులకు, వివిధ ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ప్రజలందరిపై మైసమ్మ తల్లి ఆశీస్సులు సమృద్ధిగా ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అంతకుముందు యెన్నం శ్రీనివాస్ రెడ్డికి అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మైసమ్మ తల్లికి ప్రత్యేక ఆయన పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, నాయకులు మైత్రి యాదయ్య, రామకృష్ణ, చంద్రమౌళి, కార్పొరేటర్లు పెద్ద గొల్ల నర్సింహులు, గిరి గౌడ్, తిరుమల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

