కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ (Mahabubnagar) నగరపాలక సంస్థ పరిధిలో నీటి వృథాను అరికట్టేందుకు అధికారులు వేగంగా చర్యలు చేపట్టారు. నగరంలోని ఫైర్ స్టేషన్ సమీపంలో ఉన్న టీడీ గుట్ట ప్రాంతంలో నీరు లీకవుతున్న సమస్యను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ (Madhusudan Nayak) స్వయంగా పరిశీలించారు. నీటి లీకేజీ వల్ల తాగు నీరు వృథా కాకుండా తక్షణమే మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ)ని ఆదేశించారు.
సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మంగళవారం సాయంత్రంలోగానే పనులన్నీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నీటి లీకేజీని పూర్తిగా అరికట్టే వరకు అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. లీకేజీలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో స్థానిక అధికారులు కూడా పాల్గొన్నారు.

