కలం, వెబ్ డెస్క్ : నల్లగొండ (Nalgonda) జిల్లా నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో నకిలీ పంచాయతీ పన్ను రశీదుల ఉదంతం కలకలం రేపుతోంది. ఎల్లారెడ్డిగూడెంలో రూ.500 ఇంటి పన్ను చెల్లించినట్లుగా రశీదు నంబర్ 1818తో కొందరు వ్యక్తులు నకిలీ రశీదును సృష్టించినట్లు అధికారులు గుర్తించారు. ఈ నకిలీ పత్రంలో పంచాయతీ కార్యదర్శి సంతకంతో పాటు కార్యాలయ ముద్రలను పూర్తిగా ఫోర్జరీ చేసినట్లుగా గుర్తించిన కార్యదర్శి పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు.
ఈ నకిలీ రసీదులను అడ్డుపెట్టుకుని గ్రామకంఠం భూములతో పాటు ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపి, ఈ అక్రమాలకు పాల్పడిన అసలు సూత్రధారులు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.

