కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ (Mahabubnagar) పట్టణ, మండల పరిధిలోని సర్వే నంబర్లు 927, 929, 930, 946లో కొనసాగుతున్న భూ రీసర్వే (Land Resurvey) పనులను రెవెన్యూ అదనపు కలెక్టర్ జేఎల్బీ హరిప్రియ (Hari Priya) మంగళవారం మహబూబ్‌నగర్ మండల తహశీల్దార్ ఘన్సీ రామ్‌తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా రీసర్వే పనుల పురోగతిని సమీక్షించి, క్షేత్రస్థాయిలో అనుసరిస్తున్న విధానాలను, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సర్వే నంబర్ 946లో ప్రభుత్వ భూముల రీసర్వే పనులు, 927, 929, 930 సర్వే నంబర్లలో ఆర్ఐ బృందం ఆధ్వర్యంలో ఆబాది సర్వే, గ్రామ సరిహద్దుల నిర్ధారణ పనులు చేపడుతున్నట్లు డీటీ బృందం, మండల సర్వేయర్ ఆమెకు వివరించారు. సర్వే పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.

