కలం, వెబ్ డెస్క్: వైసీపీ హయాంలో అన్ని రంగాలను అభివృద్ధి చేశామని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) అన్నారు. ఈ మేరకు పులివెందుల నాయకులు, కార్యకర్తతో భేటీ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు (Chandrababu) దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ అభ్యర్థులు నామినేషన్ వేయకుండా దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చేస్తున్నది తోండి, అన్యాయం, దౌర్జన్యం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా, దెబ్బలు తగిలినా తమ పార్టీ కార్యకర్తలు ధైర్యంగా నిలబడ్డారని కొనియాడారు.
ఈ మున్సిపల్ ఎన్నికలను (AP Municipal Elections) చూస్తూంటే కౌరవుల కుట్రలన్నీ కనిపిస్తున్నాయని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాభారతంలో శకునిలా చంద్రబాబు (Chandrababu) చేసిన మాయా పాచికలే ఇక్కడ కనబడుతున్నాయంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వ పాలనతో రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం కాపాడాల్సిన వ్యక్తులే ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు పాపాల్లో భాగస్తులైన ప్రతి అధికారి దీని గురించి ఆలోచించాలన్నారు. నామినేషన్ కేంద్రాలను ఆక్రమించడం దేశంలోనే ఎక్కడా లేదని.. ఇది చంద్రబాబు హయాంలోనే జరిగిందని దుయ్యబట్టారు. తమపాలనలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేశామన్నారు. ఎన్నికల్లో పోటీ ఉంటేనే ప్రజలు ఎవరివైపు ఉన్నారో తెలుస్తుందన్న జగన్.. ఈ ఎన్నికల్లో అసలు నామినేషనే వేయనివ్వడం లేదని విమర్శించారు.
Also Read : సవాలుగా ‘స్థానిక’ సర్దుబాటు: పవన్ కళ్యాణ్
Follow Us On : WhatsApp

