కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఉమ్మడి పాలమూరు జిల్లాలో (Mahabubnagar) ప్రకృతి సంపద మాయమవుతోంది. కొండలు, గుట్టలు, అడవుల వంటి సహజ వనరులను (Illegal Mining) అక్రమార్కులు విచ్చలవిడిగా కొల్లగొడుతున్నారు. ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టాల్సిన మైనింగ్, ఇసుక కొందరు దోపిడీకి వరంగా మారింది. మైనింగ్ శాఖ అధికారులు మాత్రం చోద్యం చూస్తు న్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో సహజ సంపద కనుమరుగవుతుందని ప్రజలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాకు కృష్ణా, తుంగభద్ర నదుల పరివాహక ప్రాంతాలు, అమ్రాబాద్ నల్లమల అడవులు, విలువైన క్వారీలు, ఇసుక రీచ్లు ప్రకృతి ఇచ్చిన వరాలు. అయితే.. సహజ సంపద ప్రభుత్వ ఖజానాకు ఆదాయాన్ని పెంచడం కంటే, కొందరు అక్రమార్కుల జేబులు నింపడానికే ఎక్కువగా ఉపయోగపడుతోందనే విమర్శలు వ్యక్తమవుతు న్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి సాగుతున్న ఈ దోపిడీ పర్యావరణాన్ని, ప్రజల జీవనాన్ని అతలాకుతలం చేస్తోంది.
రాత్రింబవళ్లు ఇసుక అక్రమ రవాణా..
ఇసుక మాఫియా కృష్ణమ్మ ఒడిని గుల్ల చేస్తోంది. జూరాల బ్యాక్ వాటర్ ప్రాంతాలు, కృష్ణా నది పరివాహక మండలాలైన గద్వాల, అలంపూర్, మక్తల్, నారాయణపేట, నాగర్ కర్నూల్ పరిధిలోని నది తీరాల నుంచి రాత్రింబవళ్లు ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. ప్రభుత్వ అనుమతులు ఉన్న క్వారీల కంటే అనుమతులు లేని చోట్ల భారీగా ఇసుకను తవ్వేస్తు న్నారు. వందలాది లారీలు, ట్రాక్టర్లలో హైదరాబాద్ వంటి మహానగరాలకు తరలిస్తున్నారు. దీనివల్ల భూగర్భ జలమట్టా లు పడిపోవడమే కాకుండా, నదీ తీర ప్రాంతాల్లో సాగునీటి బావుల ఉనికి ప్రమాదంలో పడింది. నదీ పర్యావరణ వ్యవస్థ దెబ్బతిని మత్స్యకారుల ఉపాధి కోల్పోతున్నారు.
కొండలను పిండి చేస్తూ..
మరోవైపు కొండలను పిండి చేస్తున్న క్వారీలు పచ్చని ప్రకృతిని విధ్వంసం చేస్తున్నాయి. గ్రానైట్, కంకర(స్టోన్ క్రషర్) క్వారీల్లో నిబంధనలకు విరుద్ధంగా భారీ పేలుళ్లు జరుపుతున్నారు. అనుమతించిన దానికంటే వందల అడుగుల లోతుకు తవ్వకాలు చేస్తూ కొండలను మైదానాలుగా మారుస్తున్నారు. పేలుళ్ల ధాటికి సమీప గ్రామాల్లోని ఇళ్లు పగుళ్లు వస్తున్నాయి. గాలిలో లేచే దుమ్ము, ధూళితో స్థానికులు అనారోగ్యాల బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనుమతించిన క్వారీ పరిమితుల కంటే ఎక్కువ లోతుకు తవ్వకాలు జరపడం వల్ల ప్రభుత్వానికి రావాల్సిన అసలైన రాయల్టీ కోల్పోవాల్సి వస్తోంది.
విలువైన కలప తరలింపు..
అడవుల నరికివేత, వన్యప్రాణుల మనుగడకు ముప్పుగా మారింది. నల్లమల అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న నాగర్ కర్నూల్, అచ్చంపేట పరిసరాల్లో విలువైన కలప అక్రమ రవాణా జరుగుతోంది. అటవీ సరిహద్దుల్లోని భూములను ఆక్రమించుకుంటూ అడవులను నరికేస్తున్నారు. దీనివల్ల వన్యప్రాణులు జనావాసాల్లోకి రావడం, మనుషుల చేతిలో బలవడం వంటి ఘటనలు పెరుగుతున్నాయి.
రాజకీయ, అధికార అండదండలు..
ప్రకృతి సంపద దోపిడీ, రవాణా వెనక రాజకీయ, అధికార అండదండలు పెద్ద ఎత్తున ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిఘా పెట్టాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మొత్తంగా ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయల రాయల్టీకి గండి పడుతోంది. చట్టబద్ధంగా మైనింగ్ జరిగితే జిల్లా అభివృద్ధికి ఆదాయం వచ్చేది. కానీ అక్రమార్కుల పరం కావడంతో పర్యావరణ విధ్వంసమే మిగులుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత మైనింగ్, అటవీ, రెవెన్యూ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. అక్రమ తవ్వకాలను అరికట్టి, పర్యావరణాన్ని కాపాడటంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
క్షేత్రస్థాయిలోనే అక్రమ తవ్వకాలు..
మైనింగ్ సంపద ఎక్కువగా ఉండి, ఆదాయ పరంగా ఉమ్మడి జిల్లాలోని నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ సరిహద్దు ప్రాంతాల జిల్లాలు ముందంజలో ఉన్నాయి. ముఖ్యంగా నాగర్ కర్నూల్ జిల్లాలో క్వార్ట్జ్, ఫెల్డ్స్పార్, బ్లాక్ , కలర్ గ్రానైట్, కంకర (రోడ్ మెటల్) వంటి మైనర్ ఖనిజాల లీజులు అత్యధికంగా ఉన్నాయి. అలాగే కృష్ణా నది పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉండటం వల్ల ఈ జిల్లాల నుంచే ఇసుక తవ్వకాలు, క్వారీయింగ్ కార్యకలాపాలు విస్తృతంగా సాగుతూ భారీగా మైనింగ్ ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమకూర్చుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో క్షేత్రస్థాయిలో అక్రమ తవ్వకాలు అధికారిక ఆదాయానికి గండి కొడుతున్నాయి. డ్రోన్ సర్వైలెన్స్, ఆన్లైన్ పర్మిట్లు వంటి సాంకేతిక పద్ధతులు అమలు చేస్తున్నప్పటికీ, సరిహద్దు ప్రాంతాల్లో రాత్రి వేళల్లో ఇసుక, గ్రానైట్ అక్రమ రవాణా పూర్తిగా అదుపులోకి రావడంలేదు.
ఏడాదికి ఉమ్మడి జిల్లా ఆదాయం ఇలా..
మైనింగ్ శాఖకు వస్తున్న అధికారిక ఆదాయం రాయల్టీ, ఇతర ఫీజుల ద్వారా జిల్లాల వారీగా ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలను బట్టి మారుతుంటుంది. నాగర్ కర్నూల్ జిల్లానే మైనింగ్ ఆదాయంలో అగ్రస్థానంలో ఉంది. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం ఏడాదికి సుమారు రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు ఆదాయం ఇస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా నుంచి సగటున ఏడాదికి రూ.25 కోట్ల నుంచి రూ.35 కోట్ల వరకు మైనింగ్ ఆదాయం సమకూరుతోంది.
వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో మేజర్ క్వారీలు తక్కువగా ఉన్నప్పటికీ, కృష్ణా నది ఇసుక రీచ్లు, స్థానిక కంకర క్వారీల ద్వారా ఒక్కో జిల్లా నుంచి ఏడాదికి రూ.10 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు ఆదాయం ఉంటుంది. ఇలా అన్ని జిల్లాల పరిధిలోని మైనర్ ఖనిజాలు, ఇసుక మైనింగ్ ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి సుమారు రూ.200 కోట్ల నుంచి రూ 250 కోట్ల వరకు ఆదాయం లభిస్తోంది. అక్రమ తవ్వకాలు, ఓవర్లోడింగ్ రవాణాను పూర్తిస్థాయిలో అరికడితే ప్రభుత్వానికి ఆదాయం ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉందని మైనింగ్ శాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ఆ రెండు జిల్లాల్లోనే యాక్టివ్..
ఉమ్మడి జిల్లాలో సుమారు 300 నుంచి 350 వరకు చట్టబద్ధ క్వారీ లీజులు/అనుమతులు వివిధ ఖనిజాల కోసం తీసుకున్నారు. వీటి ద్వారా ఏడాదికి రూ. 250 కోట్ల వ్యాపారం జరుగుతుంది. ప్రధానంగా రోడ్ మెటల్ కంకర, బిల్డింగ్ మెటీరియల్ క్వార్ట్జ్, ఫెల్డ్ స్పార్ , అలాగే నారాయణపేట, జోగులాంబ గద్వాల సరిహద్దుల్లో బ్లాక్,కలర్ గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. కొత్త జిల్లాల విభజన తర్వాత ఖనిజ వనరులు ఎక్కువగా ఉన్న నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లోనే అత్యధిక క్వారీ లీజులు యాక్టివ్గా నడుస్తున్నాయి.

