కలం, నేషనల్ డెస్క్: పెరుగుతున్న జీవన వ్యయం, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై యూరప్ (Europe Protests) ఖండం అట్టుడుకుతూనే ఉన్నది. నిత్యావసరాల ధరల పెరుగుదల, తక్కువ వేతనాలు, అద్దెలు విపరీతంగా పెరగడం వంటి సమస్యలపై ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తి రోడ్లపైకి చేరింది. వరుసగా రెండో వారాంతంలోనూ ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్, అల్బేనియా, బెల్జియం దేశాల్లో భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. పలుచోట్ల నిరసనకారులు, పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు అధికారులు వేలాది మంది భద్రతా సిబ్బందిని, చివరకు సైన్యాన్ని సైతం రంగంలోకి దించాల్సి వచ్చింది. నిరసనకారులపై లాఠీచార్జీలు, టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లను ప్రయోగించడంతో యూరప్ నగరాలు రణరంగాలను తలపిస్తున్నాయి.
ఫ్రాన్స్‌లో వెయ్యి మంది అరెస్ట్
ఫ్రాన్స్‌లో శనివారం జరిగిన నిరసన ప్రదర్శనల్లో దాదాపు 8 లక్షల మంది పాల్గొన్నట్లు అంచనా. రాజధాని పారిస్‌తో పాటు పలు నగరాల్లో ట్రేడ్ యూనియన్లు, ‘ఎల్లో వెస్ట్స్’ ఉద్యమకారులు భారీ ర్యాలీలు నిర్వహించారు. పగటిపూట ప్రశాంతంగా సాగిన ఈ నిరసనలు రాత్రికి హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు రోడ్లపై బారికేడ్లను తగులబెట్టడమే కాకుండా, కార్ల షోరూమ్‌ల అద్దాలను పగులగొట్టారు. పరిస్థితిని అదుపు చేయడానికి ప్రభుత్వం 70 వేల మంది పోలీసులను మోహరించింది. నిరసన హక్కును కేవలం గుర్తింపు పొందిన సంఘాలకే పరిమితం చేస్తూ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ కఠిన ఉత్తర్వులు జారీ చేయగా, పోలీసులు దాదాపు 1,000 మందిని అరెస్టు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణకు తరలించారు.
ఇటలీలో ఇంధన సంక్షోభం
ఇటలీలో యువత, విద్యార్థులు, కార్మికులు, రైతులు పెరిగిన ఇంధన ధరలు, నివాస ఖర్చులకు వ్యతిరేకంగా భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చారు. మిలన్ నగరంలో విద్యుత్ బిల్లుల పెరుగుదలకు నిరసనగా ఎనర్జీ రెగ్యులేటర్ కార్యాలయం వెలుపల పేడను కుమ్మరించి, నమూనా విద్యుత్ బిల్లులను దహనం చేశారు. రోమ్‌లో విద్యార్థులు చారిత్రాత్మక కొలోసియం కట్టడాన్ని కొద్దిసేపు ఆక్రమించి పాలస్తీనా జెండాలను ప్రదర్శించారు. గత వారం జరిగిన లూటీలను దృష్టిలో ఉంచుకుని ప్రధాని జార్జియా మెలోని.. మిలన్ నగరంలో అదనంగా 500 మంది సైనికులను మోహరించారు.
ట్రంప్ ప్రాజెక్టుపై ఆగ్రహం
అల్బేనియా రాజధాని టిరానాలో ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికి చెందిన ఒక లగ్జరీ హోటల్ నిర్మాణ ప్రాజెక్టు వల్ల స్థానిక తీరప్రాంతం పూర్తిగా దెబ్బతింటున్నదని శాస్త్రవేత్తలు హెచ్చరించడంతో ఈ వివాదం మొదలైంది. ఇక్కడ జరిగిన ఘర్షణల్లో ఇప్పటివరకు 300 మందికి పైగా నిరసనకారులు, పోలీసులు గాయపడ్డారు. అలాగే టిరానాలో కాలేజీ ఫీజులను తగ్గించాలని, ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు విద్యా మంత్రిత్వ శాఖ ఎదుట ఆందోళనకు దిగారు. అక్కడ నిరసనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో వాటర్ కానన్లను ఉపయోగించి గుంపును చెదరగొట్టారు.
స్పెయిన్‌లో దుకాణాల లూటీ
స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో గృహ నిర్మాణ సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. 87 ఏళ్ల వృద్ధురాలిని ఇల్లు ఖాళీ చేయించడంతో మొదలైన ఈ ఉద్యమం వల్ల అక్కడ రాజకీయ సంక్షోభం ఏర్పడింది. దీంతో ప్రధాని పెడ్రో సాంచెజ్ ఇప్పటికే నవంబర్ 29న ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చారు. ఆదివారం బార్సిలోనాలో హుడీలు ధరించిన దుండగులు 14 దుకాణాలను లూటీ చేసి, రోడ్లపై నిప్పు పెట్టారు. ఈ ఘటనలో దాదాపు 100 మందిని పోలీసులు అరెస్టు చేయగా, అందులో ఎక్కువ మంది మైనర్లే ఉండటం గమనార్హం. మాడ్రిడ్‌లో సైతం పెన్షన్ సంస్కరణల కోసం 25 వేల మంది ప్రశాంతంగా ప్రదర్శన చేశారు.
పోర్చుగల్‌లో క్యాంపుల ధ్వంసం
యూరప్‌లోనే అత్యంత దారుణమైన హౌసింగ్ సంక్షోభాన్ని పోర్చుగల్ ఎదుర్కొంటున్నది. అక్కడ 2017 నుంచి ఇళ్ల ధరలు, అద్దెలు రెట్టింపు అయ్యాయి. పెరిగిన ఇండ్ల అద్దెలు, ఆస్తి ధరలకు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు లిస్బన్ నగరంలో శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహించారు. రాత్రి పూట రోసియో స్క్వేర్‌లో నిరసనకారులు వేసుకున్న 100కు పైగా టెంట్లను అర్ధరాత్రి 2 గంటల సమయంలో పోలీసులు ధ్వంసం చేశారు.
బెల్జియంలోనూ అశాంతి
బెల్జియం రాజధాని బ్రస్సెల్స్లోనూ విద్యార్థులు బారికేడ్లు వేసి అద్దె స్కూటర్లు, సైకిళ్లను తగులబెట్టేందుకు ప్రయత్నించడంతో పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. ఆర్థిక ఒత్తిళ్లు, పెరిగిన ధరల సమస్యలను యూరప్ ప్రభుత్వాలు తక్షణమే పరిష్కరించకపోతే ఈ అశాంతి మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

