కలం, వనపర్తి: వనపర్తి (Wanaparthy) మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు మర్రికుంట(Marrikunta)లో పారిశుధ్య సమస్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. సూర్యచంద్ర పాఠశాలకు వెళ్లే ప్రధాన రహదారి పక్కన మురుగు నీరు నిలిచిపోవడంతో ఆ ప్రాంతం మురుగు గుంతలను తలపిస్తోంది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక ఇళ్ల నుంచి వెలువడే మురుగు నీరు రోడ్డు పక్కనే నిల్వ ఉండటంతో స్థానికులు, పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దుర్వాసనతో సతమతం..
రహదారి పక్కన నిలిచిన మురుగు నీటిలో బర్రెలు దిగుతుండటంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. మురుగు నీటి నుంచి వెలువడుతున్న దుర్వాసనతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు సైతం ఇదే మార్గంలో రాకపోకలు సాగించాల్సి వస్తుండటంతో అవస్థలు తప్పడం లేదు.
దోమల బెడద.. వ్యాధుల భయం..
రోజుల తరబడి నిల్వ ఉంటున్న మురుగు నీటితో దోమలు పెరిగే ప్రమాదం ఉందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దోమల బెడద పెరుగుతుండటంతో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రభావం పడకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
అధికారులు స్పందించాలి..
మర్రికుంట(Marrikunta)లో నెలకొన్న పారిశుధ్య సమస్యపై మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రహదారి పక్కన నిలిచిన మురుగు నీటిని తొలగించి, శాశ్వత డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దోమల నివారణకు ఫాగింగ్ నిర్వహించడంతోపాటు అవసరమైన పారిశుధ్య చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని కాలనీవాసులు కోరుతున్నారు.
Also Read : దేశాన్ని కాపాడుకుందాం: రాహుల్ గాంధీ సంచలన పిలుపు
Follow Us On: Instagram

