కలం, కరీంనగర్: కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాల రైతుల సాగునీటి హక్కుల కోసం మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) గళమెత్తారు. పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడినా సాగునీరు అందకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులతో కలిసి ఎస్సారెస్పీ డీ-86 కెనాల్ వద్ద ఆందోళనకు దిగారు.
రైతులకు నీటిని విడుదల చేయకుంటే కెనాల్ బ్రిడ్జిపై నుంచి నీటిలో దూకుతానని అధికారులను హెచ్చరించారు. రైతుల సమస్యను పరిష్కరించేందుకు స్వయంగా రంగంలోకి దిగిన ఆయన.. రెగ్యులేటరీ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులతో చర్చలు జరిపి 300 క్యూసెక్కుల నీటి విడుదలకు కృషి చేశారు.
రైతులతో కలిసి ట్రాక్టర్ నడిపిన ఎమ్మెల్యే
సాగునీటి సమస్య పరిష్కారం కోసం గంగుల కమలాకర్ వినూత్నంగా నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చొప్పదండి చౌరస్తా నుంచి రైతులను ట్రాక్టర్లో ఎక్కించుకొని స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ ఎస్సారెస్పీ డీ-86 కెనాల్ వద్దకు చేరుకున్నారు. అక్కడ రైతులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘మా నీళ్లు మాకే కావాలి’ అంటూ రైతులు ముక్తకంఠంతో నినదించారు. సాగునీరు అందక పంటలు దెబ్బతింటున్నా అధికారులు స్పందించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
కెనాల్ వద్దకు చేరుకున్న గంగుల కమలాకర్.. పోలీసు అధికారులు, ఎస్సారెస్పీ అధికారులతో చర్చలు జరుపుతూనే రైతులతో కలిసి రెగ్యులేటరీ గేట్ల వద్దకు వెళ్లారు. సాగునీరు విడుదల చేయకుంటే బ్రిడ్జిపై నుంచి నీటిలో దూకుతానని హెచ్చరించారు. రైతులకు నీరు అందించే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఓ వైపు రెగ్యులేటరీ గేట్లు ఎత్తుతూనే.. అధికారులతో చర్చల జరిపి మోటార్లు ఆన్ చేసి దిగువకు 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
పెద్దపల్లి రైతులకే పంటలున్నాయా? మా రైతులకు లేవా?
ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాల రైతులకు సాగునీటి పంపిణీలో వివక్ష చూపడం తగదన్నారు. పెద్దపల్లి ప్రాంత రైతులకు పంటలు ఉన్నట్లే తమ ప్రాంత రైతులకూ పంటలు ఉన్నాయని, వారే రైతులా.. తాము రైతులం కాదా అని ప్రశ్నించారు. రైతులందరికీ సమానంగా సాగునీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు అధికారులపై ఉందని పేర్కొన్నారు.
కాళేశ్వరం జలాల రాకతో ఎస్సారెస్పీతో పాటు వివిధ రిజర్వాయర్లు, కాలువల్లో నీటి లభ్యత పెరిగిందని గుర్తుచేశారు. ఎస్సారెస్పీ నీటిని సాగునీటితో పాటు తాగునీటి అవసరాలకు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారని తెలిపారు. అలాంటప్పుడు కరీంనగర్, చొప్పదండి ప్రాంతాల రైతులకు సాగునీరు అందించడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని నిలదీశారు.
డీ-83, డీ-86 కెనాళ్లకు సరిపడా నీరు అందక పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలను కాపాడుకోవడానికి నీటి కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడం బాధాకరమన్నారు. సాగునీటిని సమర్థంగా పంపిణీ చేసి చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రైతుల పట్ల అధికారులకు వివక్ష ఎందుకు?
రాజకీయ నాయకుల మధ్య విభేదాలు ఉండవచ్చని, కానీ సాగునీటి పంపిణీలో అధికారులు పక్షపాతంగా వ్యవహరించకూడదని గంగుల కమలాకర్ అన్నారు. అధికారులు ప్రజలకు, రైతులకు సేవ చేయాల్సిన బాధ్యతను గుర్తుంచుకోవాలని సూచించారు. తెలంగాణలోని రైతులందరూ సమానమేనని, ఒక ప్రాంత రైతులకు నీరు అందించి మరో ప్రాంత రైతులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు.
తమకు అదనపు నీరు కావాలని అడగడం లేదని, న్యాయంగా రావాల్సిన వాటా మేరకు సాగునీరు అందించాలని కోరుతున్నామని స్పష్టం చేశారు. గతంలో పదేళ్లపాటు సాగునీరు అందించిన పరిస్థితులను గుర్తుచేస్తూ.. ఇప్పుడు రైతులు నీటి కోసం పోరాటం చేయాల్సి రావడం ఏమిటని ప్రశ్నించారు. కెనాల్ గేట్ల వద్దకు రైతులు వచ్చి నిరసనలు తెలిపే పరిస్థితి రాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రస్తుతం విడుదల చేసిన నీటిని తిరిగి నిలిపివేస్తే మరోసారి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. రెండు జిల్లాల కలెక్టర్లు పరస్పరం సమన్వయం చేసుకొని కరీంనగర్, చొప్పదండి ప్రాంతాల రైతులకు సమానంగా సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతుల పంటలను కాపాడటమే తమ ప్రధాన లక్ష్యమని గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
రైతులను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం: సుంకె రవిశంకర్
మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ.. రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును సమర్థంగా వినియోగించుకొని సాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రైతుల సమస్యలపై కనీసం సమీక్ష నిర్వహించడం లేదని, అన్నదాతలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని తీసుకొచ్చి, పంపుహౌస్‌ల సహాయంతో వివిధ రిజర్వాయర్లు, కాలువలకు నీటిని తరలించి రైతులకు సాగునీరు అందించినట్లు తెలిపారు. ప్రస్తుతం రైతులు సాగునీటి కోసం ఆందోళనలు చేయాల్సి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
రైతుల కోసం కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు
ఈ ఆందోళన కార్యక్రమంలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కరీంనగర్ పీఏసీఎస్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డి, కరీంనగర్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్‌కుమార్ గౌడ్, చొప్ప దండి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చొక్కా రెడ్డి, ఇరుకుల్ల సర్పంచ్ బుర్ర రమేష్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ సుంకి శాల సంపత్ రావు, కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

