కలం, మహబూబ్ నగర్ బ్యూరో : పదవ తరగతి వార్షిక పరీక్షల్లో వందకు వంద మార్కులు సాధిస్తామని విద్యార్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. డ్రీం ఫోర్స్ ఫౌండేషన్ (Dream Force Foundation) డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సైన్స్ ల్యాబ్ ఆధ్వర్యంలో దసరా సెలవుల సందర్భంగా 10వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల పై ఐదు రోజుల శిక్షణ (Free SSC Exam Training) కార్యక్రమాన్ని మహబూబ్నగర్లోని ఫౌండేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలతో పాటు వికారాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థులు 65 మంది శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.
అక్టోబర్ 11 నుంచి 15 వరకు ఐదు రోజులపాటు విషయ నిపుణులతో విద్యార్థులకు 10వ తరగతి వార్షిక పరీక్షలపై అవగాహనను కల్పిస్తున్నారు. విద్యార్థులకు అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దసరా సెలవుల్లో విద్యార్థులు ఇతర విషయాలపై దృష్టి పెట్టకుండా చదువుకునేందుకు మంచి అవకాశం దొరికిందని వారంటున్నారు. విషయాలపై అవగాహన కల్పించడంతోపాటు చేతిరాత పై ప్రత్యక్ష శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.
వ్యక్తిత్వ వికాస నిపుణులతో ప్రేరణ తరగతులు నిర్వహించడంతో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. విషయ నిపుణులు డాక్టర్ ముక్తా మురళి గుముడాల చక్రవర్తి గౌడ్ (తెలుగు) రాఘవేందర్ (హిందీ) ఖాళీద్ (ఇంగ్లీష్) శ్రీరామ్ కరుణాకర్ (భౌతికశాస్త్రం) జి.సత్యం (గణితం) రతంగపాణి రెడ్డి (సాంఘిక శాస్త్రం) చేతిరాతపై నాగరత్నం వ్యక్తిత్వ వికాసంపై మల్లయ్య అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో. కలాం సైన్స్ లేవు అధ్యక్షులు వీ.జనార్ధన్ డ్రీమ్ ఫోర్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు టిఎన్ వెంకటేశ్వర్లు సలహాదారు కరుణాకర్ గౌడ్ శివకుమార్ మల్లప్ప ధారా ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు .
15 న శిక్షణ కార్యక్రమం ముగింపు కలాం జయంతి
దసరా సెలవుల సందర్భంగా ఏర్పాటుచేసిన పదవ తరగతి విద్యార్థుల శిక్షణా కార్యక్రమం ముగింపు సమావేశం గురువారం జరగనుందని కలాం సైన్స్ ల్యాబ్ అధ్యక్షులు జనార్ధన్ తెలిపారు . మాజీ రాష్ట్రపతి శాస్త్రవేత్త అబ్దుల్ కలాం జయంతి వేడుకలను కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు.

