జల వివాదాలతో జిల్లాల మధ్య చిచ్చు పెట్టొద్దు: గుత్తా సుఖేందర్ రెడ్డి

‎కలం, నల్లగొండ: మహబూబ్ నగర్ – నల్గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించే విధంగా కొందరు వ్యవహరించడం తగదని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హితవు పలికారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రాంతాల మధ్య విభేదాలు తలెత్తకుండా అందరూ సంయమనం పాటించాలని ఆయన పిలుపునిచ్చారు.

సోమవారం నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్ కార్యక్రమంలో ఆయన రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, జల వివాదాలు, కరువు పరిస్థితులు, రైతాంగ సమస్యలపై మాట్లాడారు. ఎంతోమంది త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణలో, జిల్లాల మధ్య వివాదాలు సృష్టించడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలుగుతుందని చైర్మన్ ఆందోళన వ్యక్తం చేశారు.

మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతోనే పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను చేపట్టామని, పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టుల పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.

‎ఎదుళ్ల రిజర్వాయర్ కేటాయింపులపై సామరస్యం..

‎ఎదుల రిజర్వాయర్ నుంచి పాలమూరు ప్రాంతానికి 1.5 టీఎంసీలు, డిండి ఎత్తిపోతల పథకానికి 0.5 టీఎంసీల నీటిని కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని గుత్తా సుఖేందర్ రెడ్డి సమర్థించారు. అయితే ఈ నిర్ణయాన్ని వివాదాస్పదం చేస్తూ కొందరు మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

అనవసరమైన వివాదాలు సృష్టించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు సరికావన్నారు. నార్లాపూర్ నుంచి నీటిని తరలించడంలో అదనపు ఖర్చు, సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతాయని, ఈ నేపథ్యంలో ఆర్థిక భారం, సమయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

ఈ జల వివాదానికి శాశ్వత పరిష్కారం చూపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే చొరవ తీసుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు. రెండు జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇంజనీర్లు సైతం రాజకీయాలకు అతీతంగా సాంకేతిక సలహాలు అందించి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాలన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో జలవిద్యుత్ ఉత్పత్తిపై కూడా ప్రభావం పడిందని చైర్మన్ తెలిపారు. ప్రస్తుత కరువు పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ నీటిని, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా రబీ సీజన్‌లో రైతులు అధిక నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని, ముందస్తు జాగ్రత్తలు పాటించి నష్టాలను తగ్గించుకోవాలని ఆయన కోరారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>