కలం, పెద్దపల్లి: ములుగు జిల్లా నుంచి కరీంనగర్ పట్టణానికి అక్రమంగా పశువులను తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో రామగుండం పోలీస్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు (Ramagundam Force) చాకచక్యంగా దాడి చేసి అడ్డుకున్నారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం మంథని మండలం లక్కేపల్లి గ్రామం వద్ద ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో పశువులను అక్రమంగా తరలిస్తున్న రెండు వాహనాలను పోలీసులు రాత్రికి రాత్రే పట్టుకున్నారు. వాహనాల్లో హింసాత్మక రీతిలో తరలిస్తున్న 11 ఆవులను పోలీసులు సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు.
రవాణాకు ఉపయోగించిన TS 05 UP 8482 నంబరు గల మహీంద్రా క్యాంపర్, అలాగే TS 30 T 5371 నంబరు గల అశోక్ లేలాండ్ బడా దోస్త్ వాహనాలను పోలీసులు జప్తు చేశారు. పశువుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామానికి చెందిన ఇస్లావత్ సోమన్న (45), ఎం.డి. తుఫాన్ (37) అనే ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పశువులను, వాహనాలను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం మంథని పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకు అప్పగించారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. రామగుండం కమిషనరేట్ పరిధిలో అక్రమ కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు. చట్టవిరుద్ధమైన పశువుల రవాణా, ఇతర అక్రమ వ్యాపారాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

