విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి.. TRS డిమాండ్

కలం, ​కరీంనగర్ బ్యూరో: రాష్ట్రంలో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను నిరంతరాయంగా అందించాలని డిమాండ్ చేస్తూ ‘తెలంగాణ రక్షణ సేన’ ఆధ్వర్యంలో కరీంనగర్ ఎస్ఈ కార్యాలయాన్ని ముట్టడించి భారీ ధర్నా నిర్వహించారు. ​ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ (Gunjapadugu Hariprasad) మాట్లాడుతూ… వర్షాభావ పరిస్థితుల్లో పంటలు ఎండిపోకుండా బోరుబావులపైనే ఆధారపడే రైతులకు విద్యుత్ కోతలు, అంతరాయాల వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

సరైన సమయంలో సాగునీరు అందక పంటలు ఎండిపోతే రైతులు ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతింటారని హరిప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను కేవలం సాంకేతిక అంశంగా చూడకుండా రైతుల జీవనోపాధి సమస్యగా పరిగణించి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ​పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జ్ లింగంపల్లి నాగరాజు మాట్లాడుతూ… ప్రభుత్వ ప్రకటనలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన ఉండటం లేదని విమర్శించారు. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అనేది రైతుల హక్కు అని, విద్యుత్ సరఫరా, పర్యవేక్షణ వ్యవస్థను పటిష్టం చేసి రైతులకు భరోసా కల్పించాలని కోరారు.

​ఈ ముట్టడి కార్యక్రమంలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ అంకం శివరాణి, నగర అధ్యక్షుడు రంగరవేణి లక్ష్మణ్ ముదిరాజ్, జిల్లా నాయకులు శ్రీరాముల రమేష్, బుడిగె పర్షారం గౌడ్, బసవేణి రాజేందర్, మ్యాక వినోద్, చంటి శ్రీనివాస్, మ్యాకల తిరుపతి, జంగ అపర్ణ, కొత్తూరి నరేష్, జంపాల రీతిష్, అంబాలా హరీష్, ఎండి రాజీ, గర్షకుర్తి విద్యాసాగర్, అబ్దుల్ హఫీజ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>