కలం, వెబ్ డెస్క్: దేశంలో ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించమని.. అందుకు అనుగుణంగా సరైన విధానాన్ని అనుసరిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరులో భారత్ ఎప్పుడూ వెనక్కి తగ్గదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మంగళవారం జరిగిన తొలి బిమ్‌స్టెక్ దేశాల హోంమంత్రుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. BIMSTEC దేశాల్లో టెర్రరిస్టులకు ఆశ్రయం దొరకకుండా సభ్య దేశాలన్నీ కలిసి పనిచేయాలని కోరారు. ఉగ్రవాదులను దాచడం, వారికి ట్రైనింగ్ ఇవ్వడం, నిధులు సమకూర్చడం వంటి కార్యకలాపాలకు ఎలాంటి అవకాశం ఉండకూడదని అన్నారు.
ఉగ్రవాదులు ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లి దాక్కోవడం లాంటి చర్యలకు అనుమతివ్వకూడదని అమిత్ షా పిలుపునిచ్చారు. అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం, కొత్తవారిని నియమించుకొని శిక్షణ ఇవ్వడం వంటి చర్యలను అడ్డుకోవాలన్నారు. ఉగ్రవాదం ఒక దేశానికే పరిమితమైన సమస్య కాదని.. దాని ప్రభావం అనేక దేశాలపై ఉంటుందని తెలిపారు. ఒక దేశ భద్రతా వ్యవస్థ మరో దేశానికి భద్రత కల్పించే విధంగా పనిచేయాలని వ్యాఖ్యానించారు.

