కలం, స్పోర్ట్స్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార సభలో యూట్యూబర్, బాక్సర్ జేక్ పాల్ (Jake Paul) చేసిన ప్రసంగం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వామపక్ష నిరసనకారులను లక్ష్యంగా చేసుకున్న ఆయన వ్యాఖ్యలను ట్రంప్ ప్రశంసించారు. అక్టోబర్ 12న ఒహియోలోని యంగ్స్టౌన్లో ట్రంప్ ప్రచార సభ నిర్వహించారు. ఈ సభకు హాజరైన జేక్ పాల్.. ముందుగా అమెరికాకు మద్దతుగా నినాదాలు చేశారు. ఆ తర్వాత నిరసనకారులపై విమర్శలు చేశారు.
చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని నిరసనలు చేస్తున్నవారు ఉద్యోగాలు చేయడం లేదా అని ప్రశ్నించారు. కార్మికులు కష్టపడి పనిచేస్తుంటే, కొందరు నిరసనలకే పరిమితమవుతున్నారని వ్యాఖ్యానించారు. యంగ్స్టౌన్ కార్మికుల నగరంగా గుర్తింపు పొందిందని ప్రస్తావించిన పాల్.. తన తల్లి కూడా కార్మిక వర్గానికి చెందినవారని తెలిపారు. సోషల్ మీడియాలో విమర్శలు చేయడం, ద్వేషాన్ని వ్యాప్తి చేయడం వల్ల దేశం నిర్మాణం కాలేదని అన్నారు. తాము ఎదుర్కొంటున్న వోక్ సోషలిస్ట్ ఉద్యమం కూడా దేశాన్ని నిర్మించలేదని విమర్శించారు.
నవంబర్ 3న జరిగే మధ్యంతర ఎన్నికల్లో ఒహియో ఓటర్లు రిపబ్లికన్లకు మద్దతివ్వాలని పాల్ కోరారు. సరైన నిర్ణయం కోసం పోరాడాలని, ఓటర్లు ఎన్నికల్లో పాల్గొని రిపబ్లికన్లు తమ ఆధిక్యాన్ని నిలబెట్టుకునేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. పాల్ ప్రసంగం ముగిసిన తర్వాత ట్రంప్ ఆయనను అభినందించారు. ప్రసంగం బాగుందని, తాను ఎంతో ఆకట్టుకున్నానని తెలిపారు. అయితే, పాల్ ఏం మాట్లాడబోతున్నారో ముందుగా పూర్తిగా తెలియదని సరదాగా వ్యాఖ్యానించారు.

