వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి: గంగుల కమలాకర్

కలం, కరీంనగర్‌: వైద్య ఆరోగ్యశాఖలో సుమారు 20 ఏళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో సేవలందిస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్‌ చేయాలని మాజీ మంత్రి, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ( MLA Gangula Kamalakar) డిమాండ్‌ చేశారు. నేడు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా సచివాలయం ఎదురుగా నేషనల్ హెల్త్ మిషన్ జాయింట్ యాక్షన్ కమిటీ.( NHM JAC) ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంగుల వెళ్లి మద్దతూ తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు బీఆర్‌ఎస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు.

కరీంనగర్‌ జిల్లాలో సుమారు 500 మంది, రాష్ట్రవ్యాప్తంగా 17 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారని, వారిని క్రమబద్ధీకరించడం ప్రభుత్వానికి పెద్ద ఆర్థిక భారం కాదని పేర్కొన్నారు. దశాబ్దాలుగా ప్రజలకు వైద్య సేవలందిస్తున్న ఉద్యోగుల సేవలను ప్రభుత్వం గుర్తించాలని ఆయన కోరారు. 20 ఏళ్లుగా పనిచేస్తున్న వారిని కాంట్రాక్టు పద్ధతిలోనే కొనసాగిస్తూ, చివరకు అదే విధానంలో పదవీ విరమణ చేసే పరిస్థితి రావడం బాధాకరమన్నారు. అర్హులైన ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయకుండా దొడ్డిదారిన నియామకాలు చేపట్టడం సరికాదన్నారు. ఉద్యోగుల సీనియారిటీ, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని న్యాయం చేయాలని కోరారు.

ప్రజారోగ్య పరిరక్షణకు వైద్య సిబ్బంది కీలకం

ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందాలంటే ముందుగా వైద్య ఆరోగ్యశాఖను బలోపేతం చేయాలని గంగుల కమలాకర్‌ అన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేసి, వారికి రావాల్సిన ప్రయోజనాలు కల్పిస్తేనే వైద్య సేవలు మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో విషజ్వరాలు, స్వైన్‌ఫ్లూ, డెంగ్యూ, తదితర అంటువ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజారోగ్యాన్ని కాపాడటంలో వైద్య సిబ్బంది పాత్ర ఎంతో కీలకమని చెప్పారు.

ప్రభుత్వంపై విమర్శలు

కరీంనగర్‌ నగర అభివృద్ధి పనులపై కూడా గంగుల కమలాకర్‌ ప్రభుత్వాన్ని విమర్శించారు. నగరంలో రహదారులు, కేబుల్‌ బ్రిడ్జి, రివర్‌ ఫ్రంట్‌, తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ నిర్మాణం తదితర అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. రహదారుల నిర్మాణానికి సంబంధించి బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో పనులు ముందుకు సాగడం లేదని విమర్శించారు. నగరంలో రహదారులు, వీధి దీపాలు, తాగునీటి సరఫరా వంటి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్‌ చేశారు.

కాంట్రాక్టు వైద్య ఉద్యోగుల సమస్యలను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి, వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు రామగుండం పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను కేటీఆర్‌కు కల్పిస్తామని వారికి హామీ ఇచ్చారు. వారి సమస్యలను పార్టీ తరఫున రాష్ట్రస్థాయిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల పోరాటానికి బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు ఎన్‌హెచ్‌ఎం జేఏసీ కరీంనగర్ అధ్యక్షులు ఈ.రమేష్, ఉపాధ్యక్షులు ఎండి కలిక్, డాక్టర్ వెంకటేష్ వర్కింగ్ ప్రెసిడెంట్, కే. రమేష్ జాయింట్ సెక్రెటరీ ఎస్. సాగర్ డిస్టిక్ కో ఆర్డినేటర్, పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>