గ్రామీణ మహిళల ఆర్థిక ప్రగతికి అండగా ‘ముల్కనూరు డెయిరీ’!

కలం, వరంగల్ బ్యూరో: పాడి పశువులే పెట్టుబడి.. పాల అమ్మకాలే జీవనాధారంగా కష్టపడే మహిళలకు సహకార రంగం అండగా నిలిస్తే ఆర్థిక స్వావలంబన సాధ్యమేనని ముల్కనూరు మహిళా సహకార డెయిరీ (Mulkanoor Dairy) చాటుతోంది. బతుకమ్మ, దసరా పండుగల వేళ సంస్థ తన సభ్యులకు రూ.15.71 కోట్ల బోనస్‌ ప్రకటించడం ద్వారా మరోసారి గ్రామీణ మహిళల శ్రమకు గుర్తింపు లభించింది. తద్వారా సుమారు 20 వేల మంది మహిళా పాల ఉత్పత్తిదారులకు ప్రయోజనం చేకూరనుంది. సంస్థ నిర్ణయం ఒక పండుగ కానుకగానే కాకుండా మహిళా సంఘాల ఆర్థిక బలోపేతానికి, సహకార వ్యవస్థ ప్రాధాన్యానికి కూడా ప్రతీకగా నిలవనుంది.

మహిళల చేతుల్లో ఆర్థిక భరోసా

గ్రామాల్లో ఎన్నో కుటుంబాలకు ప్రధాన జీవనాధారం పశువుల పోషణ, పాలు పితకడం, పాల సేకరణ కేంద్రాల్లో పోయడం వంటి పనుల్లో మహిళల శ్రమనే కీలకంగా ఉంటుంది. వారి కష్టానికి తగిన ప్రతిఫలం, ఆదాయంపై సొంత నిర్ణయాధికారం లభించడం ఇప్పటికీ కుటుంబాల్లో సవాలుగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలే సభ్యులుగా సహకార డెయిరీ ద్వారా బోనస్‌ అందుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముల్కనూరు మహిళా సహకార డెయిరీ ప్రకటించిన రూ.15.71 కోట్ల బోనస్‌ అర్హులైన సభ్యులకు నగదును బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. ఆ నగదు పండుగ ఖర్చులు, పిల్లల చదువులు, వైద్య అవసరాలు, పశువుల పోషణ వంటి వాటికి తోడ్పడనుంది.

పొదుపు నుంచి సహకార శక్తి వరకు

2002 ఆగస్టు 17న 62 గ్రామాలకు చెందిన సుమారు 5 వేల మంది మహిళలతో ముల్కనూరు డెయిరీ సంస్థ ప్రారంభమైంది. ప్రస్తుతం 192 గ్రామాల్లో 22,605 మంది మహిళా సభ్యులకు విస్తరించింది. వీరిలో సుమారు 17,500 మంది ప్రతిరోజూ పాలు సరఫరా చేస్తుంటారు. ఒకప్పుడు ఇంటి అవసరాలకు, చిన్నపాటి ఆదాయానికి పరిమితమైన పాడి పరిశ్రమ సంఘటిత వ్యాపారంగా రూపాంతరం చెందింది. సభ్యుల సంఖ్య పెరగడం, గ్రామాల పరిధి విస్తరించడం ద్వారా సంస్థపై మహిళల్లో పెరిగిన నమ్మకానికి ప్రతిబింబంగా చెప్పవచ్చు.

వ్యాపార భాగస్వాముల స్థాయికి..

మహిళా సంఘాల అభివృద్ధి పాల సేకరణతోనే ఆగిపోలేదు. సేకరించిన పాలను ప్రాసెస్‌ చేయడం, విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయడం, బ్రాండ్‌ పేరుతో మార్కెటింగ్‌ చేయడం ద్వారా ఆదాయ అవకాశాల స్థాయి దాకా విస్తరించింది. ముల్కనూరు డెయిరీ ‘స్వకృషి’ బ్రాండ్‌తో పాలు, పెరుగు, నెయ్యి, పన్నీర్‌ వంటి ఉత్పత్తులను విక్రయిస్తుంది. ఇది మహిళలను కేవలం ముడి ఉత్పత్తిదారులుగా కాకుండా, విస్తృత వ్యాపార వ్యవస్థలో భాగస్వాములుగా నిలబెట్టే అవకాశాన్ని కల్పించింది.

సంఘటిత శక్తితోనే మార్పు

మహిళా సంఘాలు ఆర్థిక లావాదేవీలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక మార్పునకు కూడా వేదికలుగా మారగలవు. సమష్టిగా పనిచేయడం ద్వారా మహిళల్లో నాయకత్వ లక్షణాలు, నిర్ణయాధికారం, ఆర్థిక అవగాహన పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ ఆదాయంలో తమ వాటా పెరిగినప్పుడు పిల్లల విద్య, ఆరోగ్యం, జీవన ప్రమాణాలపై కూడా సానుకూల ప్రభావం పడవచ్చు. అయితే ఈ మార్పు స్థిరంగా కొనసాగాలంటే మహిళల చేతుల్లో ఆదాయంపై వాస్తవ నియంత్రణ ఉండటం, సంస్థ నిర్వహణలో వారికి సముచిత భాగస్వామ్యం కల్పించడం అవసరం.

బోనస్‌తో ఆర్థిక భరోసా

ముల్కనూరు మహిళా డెయిరీ ప్రకటించిన రూ.15.71 కోట్ల బోనస్‌ పండుగ వేళ కుటుంబాలకు ఆర్థిక ఊరట కల్పించింది. తద్వారా గ్రామీణ మహిళల శ్రమకు విలువనిచ్చే సహకార వ్యవస్థగా మరోసారి చర్చలోకి వచ్చింది. మహిళా సంఘాల బలోపేతం, స్థిరమైన ఆదాయం, మార్కెట్‌ అవకాశాల విస్తరణకు ఇలాంటి నమూనాలు మరింతగా తోడ్పాటు అందిస్తే.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర మరింత కీరోల్ గా మారుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>