కలం, స్పోర్ట్స్: ఇంగ్లండ్ క్రికెట్ జట్టు (England Cricket) కోచింగ్ వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. టెస్టులు, వైట్‌బాల్ జట్ల కోసం కొత్త కోచింగ్ బృందాలను ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. బ్యాటింగ్, స్పిన్, పేస్ విభాగాలకు ప్రత్యేకంగా ముగ్గురు నేషనల్ లీడ్లను నియమించింది. మైక్ యార్డీకి ఎలైట్ నేషనల్ బ్యాటింగ్ లీడ్ బాధ్యతలు అప్పగించింది. రిచర్డ్ డాసన్ ఎలైట్ నేషనల్ స్పిన్ బౌలింగ్ లీడ్‌గా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే బాధ్యతలు చేపట్టిన ట్రాయ్ కూలీ పేస్ బౌలింగ్ లీడ్‌గా కొనసాగనున్నాడు. ఈ నియామకాలతో రెండు జట్లకు మూడు విభాగాల్లోనూ ప్రత్యేక మార్గదర్శకత్వం అందనుంది.
స్టీఫెన్ ఫ్లెమింగ్ నేతృత్వంలోని ఇంగ్లండ్ టెస్టు జట్టు కోచింగ్ బృందంలో రిచర్డ్ డాసన్, మార్కస్ ట్రెస్కోథిక్, జేమ్స్ ఫోస్టర్, ఎరిక్ సైమన్స్ ఉండనున్నారు. వీరికి అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు వివిధ దేశాల లీగ్‌లలో పనిచేసిన అనుభవం ఉంది. మరోవైపు, బ్రెండన్ మెకల్లమ్ నేతృత్వంలోని వైట్‌బాల్ జట్టు కోచింగ్ బృందంలో సారా టేలర్, జీతన్ పటేల్, టిమ్ సౌథీ చోటు దక్కించుకున్నారు. కెవిన్ పీటర్సన్ మెంటార్‌గా వ్యవహరించనున్నాడు.
రిచర్డ్ డాసన్ గతంలో ఇంగ్లండ్ లయన్స్, అండర్-19 జట్లకు కోచ్‌గా పనిచేశాడు. ఇటీవల గ్లామోర్గాన్ జట్టుకు కూడా కోచింగ్ బాధ్యతలు నిర్వహించాడు. 2025లో ఆ జట్టు కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-1కు ప్రమోషన్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. కొత్త కోచింగ్ ఏర్పాట్లు దక్షిణాఫ్రికా టెస్టు పర్యటన, ఆస్ట్రేలియా వైట్‌బాల్ పర్యటన నుంచి అమల్లోకి రానున్నాయి. రాబోయే అంతర్జాతీయ సిరీస్‌లకు ఇంగ్లండ్ జట్లను సిద్ధం చేయడంలో ఈ బృందాలు కీలకంగా వ్యవహరించనున్నాయి.

