కలం, ఆదిలాబాద్ : అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు (Bathukamma Festival) సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ రాజర్షిషా, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష, ఆదిలాబాదు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై పూజ కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు బతుకమ్మ, నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. పూలను దైవంగా భావించి పూజించే అద్భుతమైన సంస్కృతి మన బతుకమ్మ పండుగ సొంతమని, పట్టణాలు, గ్రామాల్లో ఈ వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నట్లు తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పోషణ్ అభియాన్, అడాప్షన్, బాల్య వివాహాల నిరోధం వంటి వివిధ పథకాలకు సంబంధించిన స్టాళ్లతో అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు.
గతేడాది లాగే ఈసారి ప్రభుత్వం తరఫున అర్హులైన మహిళలందరికీ త్వరలోనే నూతన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. జిల్లాలోని అన్ని శాఖల సమన్వయంతో ఇలాంటి సాంస్కృతిక వేడుకలను మున్ముందు ఘనంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి అతిథులు బతుకమ్మ పాటలపై ఆడారు. అనంతరం సివిల్ సర్వీస్ ఆటలకు జిల్లా నుండి ఎంపికైన క్రీడాకారులను కలెక్టర్ శాలువాతో సత్కరించే అభినందించారు.

