కలం, నకిరేకల్ : వ్యవసాయ భూమి రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న ఫెన్సింగ్ జాలీని గుర్తుతెలియని దుండగులు దొంగిలించిన ఘటన నకిరేకల్ (Nakrekal) మండల పరిధిలోని చందుపట్ల గ్రామ రెవెన్యూ శివారులో చోటుచేసుకుంది. ఈ ఘటనపై బాధితుడు నకిరేకల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామానికి చెందిన కంచర్ల మహేందర్ రెడ్డికి చందుపట్ల శివారులోని సర్వే నంబర్ 783లో 32 గుంటల వ్యవసాయ భూమి ఉంది. ఈ చేను పక్కనే ఇనుపాముల నుంచి చందుపట్ల వైపు వెళ్లే 33 ఫీట్ల పంచాయతీ రాజ్ రోడ్డు వెళ్తుంది.
రోడ్డుపై సంచరించే పశువులు, మేకలు, గొర్రెలు పంట చేనులోకి రాకుండా ఉండేందుకు గాను ఆయన రెండు నెలల క్రితం రాతి కడ్డీలు పాతించి దాదాపు 120 ఫీట్ల పొడవునా ఫెన్సింగ్ జాలీని ఏర్పాటు చేసుకున్నారు. కాగా, ఆదివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు రాతి కడ్డీలకు ఉన్న బైండింగ్ వైరును కత్తిరించి, 120 ఫీట్ల ఫెన్సింగ్ జాలీని దొంగిలించుకుపోయారు. సోమవారం ఉదయం చేను వద్దకు వెళ్లిన మహేందర్ రెడ్డి జాలీ చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే నకిరేకల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దొంగతనానికి పాల్పడిన నిందితులను త్వరితగతిన గుర్తించి, వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు.

