కలం, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ రిమ్స్ (Adilabad RIMS) ఆసుపత్రిలోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగం (ఎస్‌ఎన్‌సీయూ) ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 18 మంది శిశువులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిశ్చార్జి అయిన శిశువుల్లో మహారాష్ట్రకు చెందిన వారు ఏడుగురు, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వారు 11 మంది ఉన్నట్లు వెల్లడించారు.
డిశ్చార్జి అయిన శిశువుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు సంబంధిత వైద్య బృందాలు, వైద్యాధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. శిశువులకు అవసరమైన వైద్య సేవలు, ఆరోగ్య పర్యవేక్షణ, తదుపరి ఫాలోఅప్ సేవలు నిరంతరాయంగా అందేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. శిశువుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, వైద్య బృందాల ద్వారా వారి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు.

