అక్రమ భూ పట్టాలు.. గ్రామస్థుల ఆందోళన

కలం, అచ్చంపేట: దశాబ్దాల కాలంగా మిస్సింగ్‌లో ఉన్న భూమిని పట్టా చేసుకుని.. దాన్ని ఇతరుల పేరిట మార్చి అసలైన పట్టాదారుడిని ఇబ్బంది పెడుతున్న ఘటన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండలంలోని అయ్యవారిపల్లి గ్రామం (Ayyavaripalli Village)లో వెలుగు చూసింది. సోమవారం అచ్చంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట గ్రామ సర్పంచి జగత్ రెడ్డి ఆధ్వర్యంలో బాధిత రైతు తరఫున గ్రామస్థులు ఆందోళన చేశారు.

అనంతరం సబ్ కలెక్టర్ సలోని చోబ్రకు సమస్యను వివరించి న్యాయం చేయాలని కోరారు. గ్రామస్థుల వివరాల ప్రకారం.. 2006లో నయీం ముఠా పేరుతో కొందరు వ్యక్తులు గ్రామస్థులకు చెందిన పంట భూములను అతి తక్కువ రేటుకే బెదిరించి కొనుగోలు చేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ధరణి పాస్ పుస్తకాల పంపిణీ క్రమంలో మళ్లీ బాధిత రైతులకే ఆ పట్టా భూములు ధరణిలో నమోదై.. పట్టా పాస్ పుస్తకాలు కూడా వచ్చాయి.

2014లో మాయమై.. 2026లో ప్రత్యక్షం..

ఈ క్రమంలో ఇదే గ్రామానికి చెందిన ద్యాప శిశుపాల్ రెడ్డికి అనువంశికంగా వస్తున్న 13 ఎకరాల 17 గుంటల వ్యవసాయ భూమి 2014లో రికార్డుల్లో నుంచి మాయమైంది. బాధిత రైతు మాత్రం పొలాన్ని దున్నుకుని సాగు చేసుకుంటున్నారు. భూమి సమస్యపై చాలాసార్లు తహసీల్దార్, ఆర్డీవో కార్యాలాయాల్లో ఫిర్యాదులు చేశారు. అప్పటివరకు ఆన్‌లైన్‌లో కనిపించని భూమి 2026, ఆగస్ట్ 9న వెబ్‌సైట్‌లో కనిపించింది.

అయితే అది 11 మంది పేరిట రిజిస్ట్రేషన్ అయి ఉండటం.. అక్కడి నుంచి వెంటనే మరికొంతమంది పేరు మీదకి మార్చుకున్నట్లు ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భూమిని అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్నదెవరో విచారించి.. వారిపై, సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. సబ్ కలెక్టర్ సలోని చోబ్ర స్పందిస్తూ.. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>